Begin typing your search above and press return to search.

దర్శకత్వం.. సంగీతం.. గానం కూడానా!

By:  Tupaki Desk   |   6 Oct 2017 7:38 AM
దర్శకత్వం.. సంగీతం.. గానం కూడానా!
X
బుల్లితెరతో మొదలుపెట్టి సినిమాల వరకు చిన్న చిన్న పాత్రలతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిన నటుడు హర్షవర్ధన్. దాదాపు రెండున్నర దశాబ్దాల కిందట్నుంచే అతడి ప్రస్థానం మొదలైంది. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ నటుడిగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి సినిమాలు అతడి టాలెంటేంటో చెబుతాయి. ఐతే నటుడిగా ఎదగలేకపోయినా.. రచయితగా మాత్రం మంచి పేరే సంపాదించాడు హర్షవర్ధన్. ఇష్క్.. గుండె జారి గల్లంతయ్యిందే.. మనం.. 24 లాంటి సినిమాలతో రచయితగా అతడికి చాలా మంచి పేరొచ్చింది. ఈ ఫేమ్ ను ఉపయోగించుకుని అతను మెగా ఫోన్ కూడా పట్టేశాడు.

హర్షవర్ధన్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రోమోలు ఇదివరకే ఆసక్తి రేకెత్తించాయి. ‘ఎ హర్షవర్ధన్స్ మ్యూజికల్ నరేటివ్’ అంటూ పోస్టర్ మీద ముద్రించి.. తననే సంగీత దర్శకుడిగా కూడా పరిచయం చేసుకుని షాకిచ్చాడు హర్ష. అతడిలో ఓ సంగీత దర్శకుడున్నాడని ఇంతవరకు జనాలకు తెలియదు. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటను లాంచ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పాటను హర్షవర్ధనే స్వయంగా ఆలపించాడు కూడా. శ్రీమణి రాసిన ఈ పాటను హర్ష బాగానే పాడాడని చెప్పాలి. గాయకుడిగా అతడి గొంతు కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఈ పాట విజువల్స్ చూస్తే సీనియర్ దర్శకుడు వంశీ గుర్తుకురాక మానడు. హీరోయిన్ శ్రీముఖిని అచ్చం వంశీ కథానాయిక స్టయిల్లో చూపించాడు హర్ష. ఇంతకముందు భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన ‘మల్లెపువ్వు’ సినిమాలో హీరోగా నటించిన మురళీకృష్ణ ఇందులో కథానాయకుడిగా చేస్తున్నాడు.