Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వాటికి చెక్ పెట్టగలడా

By:  Tupaki Desk   |   14 Dec 2018 5:30 PM GMT
ఎన్టీఆర్ వాటికి చెక్ పెట్టగలడా
X
అశేష అభిమానులతో అన్న అని పిలిపించుకునే స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. ప్రమోషన్ విషయంలో క్రిష్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఇప్పటికే లెక్కలేనన్ని పోస్టర్లు ఆన్ లైన్ ని ముంచెత్తాయి. ఒకటి రెండు పాత్రలను మినహాయించి అందరి లుక్స్ రిలీజైపోయాయి. ఫ్యాన్స్ డిసెంబర్ 16న విడుదల కానున్న ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఏమేం అంశాలు ఉంటాయో అన్న దాని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ రెండు భాగాల్లో తీశారు. కథానాయకుడు ఒకటి కాగా రెండోది మహానాయకుడు. కానీ ఇటీవల విడుదల చేస్తున్న పబ్లిసిటీ మెటీరియల్ చూస్తే ఎక్కడా ఎన్టీఆర్ లోగో కింద కథానాయకుడు అని కానీ మహానాయకుడు అని కానీ లేదు. కేవలం ఎన్టీఆర్ అని మాత్రమే ఉంది. మరి ట్రైలర్ లో రెండు మిక్స్ చేసి ఓ కామన్ ట్రైలర్ వదులుతారా లేక కథానాయకుడిది మాత్రమే ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే దీని సంగతలా ఉంచితే అసలు ఎన్టీఆర్ లో ఎంతవరకు నిజానిజాలు చూపిస్తారు అనే దాని గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబుని కించిత్ కూడా నెగటివ్ గా చూపే అవకాశం లేదని ఎన్టీఆర్ గారి చరమాకంలో జరిగిన పరిణామాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉండేలాగే స్క్రిప్ట్ వర్క్ జరిగిందని ఇప్పటికీ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

నిజాయితీగా వైస్రాయ్ ఎపిసోడ్ చూపిస్తారనే నమ్మకం ఫ్యాన్స్ లో కూడా లేదు. కానీ ఎంతమేరకు బాబుని సాఫ్ట్ గా చూపిస్తారు అనేదే హాట్ టాపిక్. మహానటిలో సావిత్రి గారి పతనాన్ని ఆవిడ అలవాట్లను దాపరికం లేకుండా నాగ అశ్విన్ చూపించేసాడు. దానికి బలమైన ఎమోషన్ తోడవ్వడంతో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ అలా కాకుండా ఎన్టీఆర్ ఒకే కోణంలో కథ చెబితే మాత్రం చిక్కులు తప్పవు. మారి వీటికి చెక్ పడుతుందా లేక అనుమానాలు నిజమయ్యేలా సినిమా ఉంటుందా అనేది తేలాలంటే ఇంకొక్క మూడు వారాలు ఆగితే సరి.