Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడు పేరు నిలబెట్టుకున్నాడుగా..

By:  Tupaki Desk   |   22 Dec 2018 10:31 AM GMT
ఆ దర్శకుడు పేరు నిలబెట్టుకున్నాడుగా..
X
చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం చేసి.. ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి. తొలి సినిమాలోనే తన అభిరుచి ఏంటో చాటుకున్నాడతను. ఈ చిత్రం కమర్షియల్‌ గా అంత సక్సెస్ కాకపోయినప్పటికీ ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో పాటలు.. ప్రేమ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఆ చిత్రం సగం అయ్యేసరికి మంచి ఫీలింగ్ కలుగుతుంది. కానీ ద్వితీయార్ధంలో సినిమా ఎటెటో వెళ్తుంది. చివరికి ఒక భారమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక హను రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రథమార్ధంలో లవ్ స్టోరీ వారెవా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి మంచి ఎమోషనల్ హై ఇస్తుంది. కానీ సెకండాఫ్ చూశాక చల్లబడిపోతాం.

బ్లాక్ బస్టర్ కావాల్సిన ఆ చిత్రం ఎబోవ్ యావరేజ్ కావడానికి రెండో అర్ధమే కారణం. ఇక ‘లై’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రథమార్ధం బాగానే అనిపించి.. సెకండాఫ్ చూశాక నీరసం వచ్చేస్తుంది. అదేం చిత్రమో ఏమో కానీ.. ప్రథమార్ధం వరకు మెప్పించే హను.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి తేలిపోతాడు. సినిమాను ముగించడంలో తడబడిపోతాడు. ఇందువల్లే సోషల్ మీడియా జనాలు అతడిని ‘హాఫ్ డైరెక్టర్’ అంటూ ట్రోల్ చేస్తుంటారు. ‘పడి పడి లేచె మనసు’తో అయినా ఆ బలహీనతను అధిగమిస్తాడేమో అనుకుంటే.. ఈసారి రెండో అర్ధాన్ని మరింత దారుణంగా తయారు చేశాడు.

ప్రథమార్ధం వరకు మంచి ఫీలింగ్ ఇచ్చే ఈ చిత్రం ద్వితీయార్ధంలో పూర్తి భిన్నమైన భావన కలిగిస్తుంది. మంచి సినిమాను హను చేజేతులా చంపేసినట్లుగా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరిదీ ఒకటే మాట.. ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ పోయింది అని. మొత్తానికి మరోసారి తనను జనాలు ‘హాఫ్ డైరెక్టర్’ అనడానికి స్కోప్ ఇచ్చాడు హను. టాలెంట్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడతను. ఇన్నాళ్లూ ఎలాగోలా నెట్టుకొచ్చాడు కానీ.. ‘పడి పడి లేచె మనసు’తో వచ్చిన చెడ్డ పేరుతో హనుకు చాలా కష్టమయ్యేలాగే ఉంది.