Begin typing your search above and press return to search.

వీళ్ల‌కు డోర్లు మూసుకున్న‌ట్టేనా?

By:  Tupaki Desk   |   7 Feb 2019 6:53 AM GMT
వీళ్ల‌కు డోర్లు మూసుకున్న‌ట్టేనా?
X
కాలం మారుతోంది.. యుగాలు మారుతున్నాయి.. కానీ ఆలోచ‌న‌ల్లో మార్పు రాక‌పోతే ఎలా? కాలంతో పాటే ప‌రుగు పెట్టాలి. మారాలి.. మార్పు కోరాలి.. కొత్త‌ద‌నాన్ని అందిపుచ్చుకోవాలి. టెక్నాల‌జీ యుగంలో పాత చింత‌కాయ ఆలోచ‌న‌ల‌తో నెగ్గుకు రావ‌డం అన్న‌ది కుద‌ర‌దు. ఇది ఒక్క సినీరంగానికే కాదు.. అన్ని రంగాల‌కు ఆపాదించాల్సిన ఫార్ములా. నేటిత‌రం ప్ర‌స్తుతం స్టార్ మూవీస్, మూవీస్ న‌వ్, హెచ్‌ బీవో, రోమెడీ, యానిమ‌ల్ ప్లానెట్, డిస్క‌వ‌రీ, సోనీ పిక్స్, అండ్ ఫ్లిక్స్ వంటి టాప్ రేంజ్ చానెల్స్ చూసేందుకు అల‌వాటు ప‌డ్డారు. వాటిలో యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో ఉండే ఎన్నో విష‌యాల్ని తెలుసుకుంటున్నారు. హాలీవుడ్ సినిమాల్ని చూసి ఆ భాష‌నే నేర్చేసుకునే ర‌కం ఇప్పుడున్నారు. ఓన్లీ ఇంగ్లీష్‌ మీడియం.. ఇంకా తెలుగు మీడియం ఎక్క‌డ‌? అలాంట‌ప్ప‌డు మ‌న ద‌ర్శ‌కులు ఇంకా పాత కాలం దూర‌ద‌ర్శ‌న్ సినిమా చూపిస్తామంటే ఊరుకుంటారా? అందుకే వీళ్లు వండి వార్చే సినిమాల్ని చూసేందుకు యూత్ థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

అందుకే ఇటీవ‌లి కాలంలో శ్రీ‌ను వైట్ల‌.. వి.వి.వినాయ‌క్.. బోయ‌పాటి.. పూరి జ‌గ‌న్నాథ్‌.. వంటి టాప్ రేంజ్ డైరెక్ట‌ర్స్ ప‌ప్పులు ఉడ‌క‌డం లేద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. తాజా స‌న్నివేశం చూస్తుంటే శ్రీ‌నువైట్ల‌, వినాయ‌క్ డైలెమాలో నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌టికి రాలేర‌ని అర్థ‌మైంది. మాస్ మ‌సాలా బిస్కెట్స్ తో ప‌న‌వ్వ‌ద‌ని బోయ‌పాటికి అర్థ‌మైపోయింది. ఆయ‌న‌కు బాల‌య్య, బెల్ల‌కొండ శీను త‌ప్ప వేరొక ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదన్న విమ‌ర్శ‌లు పోటెత్తుతున్నాయి. కొణిదెల కాంపౌండ్ .. అక్కినేని కాంపౌండ్ .. ఎన్టీఆర్ వ‌ద్ద బోయ‌పాటికి డోర్స్ క్లోజ్ అంటూ ప్ర‌చారం సాగుతోంది. వ‌రుస ఫ్లాపుల‌తో వైట్ల త‌న మెడ‌కు త‌నే ఉచ్చు వేసుకున్నారు. కాస్ట్ లీ విజువ‌ల్స్ తో `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రాన్ని నాశిర‌కంగా చూపించిన ఫలితం వైట్ల‌పై న‌మ్మ‌కం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఇక వి.వి.వినాయ‌క్ సైతం పాత ఫార్ములాతో సినిమాలు తీయ‌గ‌ల‌రు త‌ప్ప కొత్త‌ద‌నంతో దూసుకుపోలేర‌ని ఇండ‌స్ట్రీ ఫిక్స‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే సీనియ‌ర్ హీరోలు సైతం వెంట‌నే అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సైతం ఇటీవ‌ల కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వాటిని జ‌నం తిర‌స్క‌రించారంటే పాత చింత‌కాయ ఫార్ములా న‌చ్చ‌లేద‌నే. వీళ్లంద‌రితో పోలిస్తే పూరి శైలి వేరు. అత‌డు మాస్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ చిత్రాల్ని రొటీన్ ఫార్ములాతో తీసి ప‌రాజ‌యాల్ని ఎదుర్కొన్నాడు. కొత్త పంథాలో తీయ‌గ‌లిగినా ఎందుక‌నో చ‌తికిల‌బ‌డ్డాడు. రొటీన్ చెత్త క‌థ‌లు.. అవే రిపీటెడ్ సీన్లు.. ర‌గ్గ్ డ్ ట్రెండ్.. అత‌డి పాలిట శాపం అయ్యాయి.

ఈ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల విష‌యంలో అస‌లేం జ‌రుగుతోంది? అంటే .. కాలంతో పాటే మార‌క‌పోవ‌డమే పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాల విష‌యంలో యూత్ డిస్క‌ష‌న్ చాలా హై రేంజులో ఉంటోంది. దీనివ‌ల్ల అంచ‌నాల్ని అందుకోలేక‌పోతే, కొత్త‌ద‌నం తేలేక‌పోతే ఎంత‌టి వారికైనా ముప్పు త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. ప్లాపులిచ్చిన పాపం వ‌దిలేట్టు లేదు.. పాత చింత‌కాయ ఆలోచ‌న‌లు ముప్పుగా మారాయి. ఈ మూస‌లో ఇంకా ఏఏ డైరెక్ట‌ర్ ఉన్నారో వాళ్లంద‌రి సీను ఇలానే ఉంటుందిక‌!! పాజిటివ్ గా ఆలోచించి ప‌ద్ధ‌తి మార్చుకుంటేనే ఎవ‌రికైనా మ‌నుగ‌డ ఉంటుంది ఇక్క‌డ‌!