Begin typing your search above and press return to search.

స్టూడియో వివాదంలో ఇళ‌య‌రాజాదే త‌ప్పా?

By:  Tupaki Desk   |   1 March 2020 4:17 AM GMT
స్టూడియో వివాదంలో ఇళ‌య‌రాజాదే త‌ప్పా?
X
లెజెండ‌రీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా ఇటీవ‌లి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. కొన్ని నెల‌లుగా చెన్నై- ప్ర‌సాద్ స్టూడియోస్ తో ఆడియో రైట్స్ ఒప్పందానికి సంబంధించిన విష‌యంలో వివాదం వ‌ల్ల ఆయ‌న పేరు ప‌దే ప‌దే మార్మోగుతోంది. ఇళ‌య‌రాజాని ఆ స్టూడియో హ‌క్కుల‌ నుంచి త‌ప్పించి ఎలాగైనా బ‌య‌ట‌కు పంపించేయాల‌ని వోన‌ర్స్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వివాదం కొన్ని నెల‌లుగా కోర్టులో న‌లుగుతోంది. తాజాగా ఈ కేసు విచార‌ణ‌ను రెండు వార‌ల్లో గా పూర్తిచేయాల‌ని చెన్నై మధ్యవర్తిత్వ కోర్టుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళ‌య‌రాజా సాలిగ్రామంలో ప్ర‌సాద్ స్టూడియో నుంచే 42 ఏళ్ల‌గా సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అందుకు సంబంధించిన ఒప్పందం ఉంది. అయితే గ‌డువు ముగిసినా ఆయ‌న స్టూడియోని వీడ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌సాద్ స్టూడియో అధినేత అక‌స్మాతుగా ఖాళీ చేయాల‌ని ఆదేశించ‌డంతో అందుకు ఇళయ‌రాజా అంగీక‌రించ‌లేదు. ఈ విష‌యంలో భార‌తీరాజా- అమీర్ - సెల్వ‌మ‌ణి వంటి పెద్ద‌లు క‌ల్పించుకుని ప్ర‌సాద్ స్టూడియో అధినేత‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఇళ‌య‌రాజా మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. కేసు విచార‌ణ అనంత‌రం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లాల్సొచ్చింది. విచార‌ణ‌లో ఇళ‌య‌రాజా ఎంతో ఎమోష‌న్ అయ్యారు. స‌ద‌రు స్టూడియోతో ఎన్నో ఏళ్ల అనుబంధం కొన‌సాగింద‌ని... వ‌దిలి వెళ్లిపోవ‌డం ఎలా సాధ్యం అని ఇళ‌య‌రాజా ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం త‌న సినిమాల‌కు అక్క‌డ నుంచే ప‌నిచేస్తున్నారు.

ఇక‌పై కూడా అదే స్టూడియోలో ఉండేలా ఆదేశాలివ్వాల‌ని రాజా కోర్టుని కోరారు. అయితే ఇటీవ‌లే న్యాయమూర్తి భారతీదాస్‌ సమక్షంలో విచారణ జరిగింది. దీంతో రెండు వార‌ల్లో విచార‌ణ పూర్తి చేయాల‌ని మ‌ధ్య‌వ‌ర్తిత్వ‌ కోర్టుకు ఆదేశాలిచ్చింది. అయితే ఈ వ్య‌వ‌హారంలో ఇళ‌య‌రాజా మొండి ప‌ట్టుద‌ల‌కు పోతున్నార‌ని...త‌న‌ది కాని స్టూడియోలో ఆయ‌నెలా ఉంటార‌ని స్టూడియో అధినేత వాదిస్తున్నారు. ఈ విష‌యంలో ఇళ‌య‌రాజాని ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు.