Begin typing your search above and press return to search.

' జై భీమ్'లో తెరవెనుక హీరో ఆయనే!

By:  Tupaki Desk   |   4 Nov 2021 2:30 PM GMT
 జై భీమ్లో తెరవెనుక హీరో ఆయనే!
X
మొదటి నుంచి కూడా సూర్య రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను .. వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలను చేస్తూ వస్తున్నాడు. బయోపిక్ గా ఆ మధ్య ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకి, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా సూర్యకి ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. అదే విధంగా చంద్రూ అనే ఒక అడ్వకేట్ ను .. ఒక కేసు విషయంలో నిస్వార్థంతో ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సూర్య 'జై భీమ్' సినిమాను చేశాడు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.

అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 2వ తేదీ నుంచి ఈ సినిమా స్టీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. సూర్య పోషించిన చంద్రూ పాత్రను గురించే చెప్పుకుంటున్నారు. 90 వ దశకంలో తమిళనాట జరిగిన ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ ఇది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి చలించిపోయిన చంద్రూ అనే అడ్వకేట్, వాళ్ల తరఫున నిలబడి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఎన్నో అవాంతరాలను .. సవాళ్లను ఎదుర్కొని గిరిజనుల కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తాడు.

ఈ కథకు మూలపురుడు .. స్ఫూర్తి అయిన ఆ చంద్రూనే పై ఫొటోలో సూర్య పక్కన నుంచున్న వ్యక్తి. ఇప్పుడు తెరపై సూర్యకి దక్కుతున్న ప్రశంసలు .. సూర్య ద్వారా ఆయనకు చేరేవే. అయితే ఆయన ఈ ఒక్క కేసును మాత్రమే కాదు, ఎంతోమంది సామాన్యుల తరఫున నిలబడి వాళ్లకి న్యాయం జరిగేవరకూ అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర ఆయన కెరియర్లో కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన జడ్జిగా కూడా పనిచేశారు. తనకి సంబంధించినంతవరకూ 'మై లార్డ్' అనే సంభోదన పట్ల అయిష్టతను వ్యక్తం చేశారు.

అంతేకాదు .. తాను జడ్జిగా ఉన్నప్పుడు కేసులు పెండింగులో పెట్టడానికి ఆయన ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించడానికి ఆయన ఉత్సాహాన్ని చూపేవారు. అలా జడ్జిగా తన ఆరేళ్ల పదవీ కాలంలో ఆయన 96 వేలకి పైగా కేసులను పరిష్కరించి కొత్త రికార్డును సృష్టించారు. అంతేకాదు సామాజిక అసమానతల విషయంపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పదవి విరమణకు ముందు .. ఆ తరువాత ఆస్తుల వివరాలను వెల్లడించి ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఆనవాలుగా నిలిచారు. అలాంటి వ్యక్తిని గురించి అందరికీ తెలిసేలా చేసిన సూర్యను ప్రశంసించనివారంటూ లేరు.