Begin typing your search above and press return to search.

భారీగా ఛార్జ్ చేస్తున్న టాలీవుడ్ బుట్టబొమ్మ.. సినిమాకు అంతనా?

By:  Tupaki Desk   |   8 July 2021 3:30 AM GMT
భారీగా ఛార్జ్ చేస్తున్న టాలీవుడ్ బుట్టబొమ్మ.. సినిమాకు అంతనా?
X
పోతపోసిన శిల్పంలా కూసింత ఎక్కవ కాకుండా అలా అని తక్కువ కాకుంటే మిసిమిసలాడే అందం ఆమె సొంతం. వరుస ఎదురుదెబ్బలకు కుంగిపోకుండా పట్టుదలతో తనను తాను ఫ్రూవ్ చేసున్న ఆమెకు టాలీవుడ్ బుట్టబొమ్మ అన్న ట్యాగ్ ను తగిలించుకునే వరకు వెళ్లింది. హోయలు ఒలికించే ఆమె అందంలో ఒకలాంటి గ్రేస్ ఉంటుంది. అదే పూజాహెగ్డేకు ఆభరణంలా మారిందని చెప్పాలి. సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. సదరు సినిమాలో తన పాత్ర గురించి ప్రత్యేక శ్రద్ధ ఆమెను అందలానికి ఎక్కించేస్తోంది.

వరుస హిట్లతో దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్... ఇలా వుడ్ ఏదైనా తనకు మాత్రం తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న ఈ భామ చేతిలో ప్రస్తుతం ఏకంగా ఆరు సినిమాలు ఉండటం విశేషం. టాప్ హీరోలతో జత కట్టిన ఈ భామ టైంకు ఇప్పుడు తిరుగులేదని చెబుతారు. అవకాశాలు వచ్చే వేళలో.. వర్కు మీద మరింత ఫోకస్ చేసి.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఆమె.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతోంది.

నిజానికి ఒకే సమయంలో ఎక్కువ సినిమాల్ని ఒప్పుకోవటం ఓకే అయినా.. వాటిని సర్దుబాటు చేయటం అంత తేలికైన విషయం కాదు. తాట తెగుతుంది. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా.. ఎక్కడా క్లాష్ రాకుండా డేట్లను సర్దుబాటు చేస్తోందట. కాకుంటే.. రిలాక్స్ అన్న మాటను పక్కన పెట్టేసినట్లుగా చెబుతారు. దీంతో.. ఆరుసినిమాల్ని ఒప్పేసుకున్నా.. ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా ఆమె పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా రూ.3.5 కోట్లను ఛార్జ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కొందరు టాప్ హీరోల రెమ్యునరేషన్ కు ధీటుగా ఆమె పారితోషికం ఉందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన టాప్ హీరోయిన్లకు అందనంత భారీగా ఛార్జి చేస్తున్నప్పటికి.. దర్శక నిర్మాతలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా బుట్టబొమ్మ తమ సినిమాలో ఉంటే చాలన్నట్లుగా ఫీల్ కావటం.. చాలామంది హీరోయిన్లకు ఆసూయ పుట్టిస్తుందన్న మాట వినిపిస్తోంది. నిజమే.. అంతేసి రెమ్యునరేషన్ అంటే మాటలు కాదు కదా?