Begin typing your search above and press return to search.

'హలో వరల్డ్' అంటున్న మెగా డాటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   25 July 2022 4:10 PM GMT
హలో వరల్డ్ అంటున్న మెగా డాటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X
'ఒకమనసు' చిత్రంతో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల హీరోయిన్ గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఓటీటీ రంగంలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ పై వెబ్ సిరీస్ లని నిర్మించడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆమె నిర్మించిన 'ముద్దపప్పు ఆవకాయ్' 'నాన్నకూచి' 'మేడ్ హౌస్' 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వంటి సిరీసులు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక ఇప్పుడు ''హలో వరల్డ్'' అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ZEE 5' తో కలిసి నిహారిక ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ని రూపొందించింది. పెళ్లి తర్వాత నిహారిక నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ఇదే. 'గీతా సుబ్రహ్మణ్యం' ఫేమ్ శివసాయి వర్ధన్ జలదంకి దీనికి దర్శకత్వం వహించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

ఇందులో ఆర్యన్ రాజేశ్ - సదా - నిఖిల్ వి సింహా - రామ్ నితిన్ - నయన్ కరిష్మా - సుదర్శన్ గోవింద్ - నిత్యా శెట్టి - జీలా అనిల్ - అపూర్వరావు - స్నేహల్ ఎస్ కామత్ - రవి వర్మ - జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను జీ5 అనౌన్స్ చేసింది.

''హలో వరల్డ్'' సిరీస్ ను ఇండిపెండెన్స్ డే వీక్ లో ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఆఫీస్ డ్రామాని 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తమ కష్టాల నుంచి బయటపడాలనే ఆశతో పెద్ద ఐటీ కంపెనీలోకి అడుగుపెట్టిన ఎనిమిది మంది యువకుల కథ ఇదని.. జీవితం అంటే తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుందని తెలియజెప్తుందని మేకర్స్ వెల్లడించారు.

'హలో వరల్డ్' తో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను ఆవిష్కరించనున్నారు. వర్క్‌ ప్లేస్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు జీ5 ఓటీటీతో కలిసి నిహారిక తీసుకురాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణను పొందుతుందో చూడాలి.

నిజానికి Zee5 ఓటీటీ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్రెష్ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేస్తోంది. RRR వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు పెడుతోంది. తెలుగు కంటెంట్ విషయంలో దూసుకుపోతోన్న జీ5.. ''హలో వరల్డ్' తో మరింత మందికి దగ్గరవ్వాలని భావిస్తోంది.