Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికలపై హేమ సంచలనం.. వైరల్ గా ఆడియో క్లిప్

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:24 AM GMT
‘మా’ ఎన్నికలపై హేమ సంచలనం.. వైరల్ గా ఆడియో క్లిప్
X
ఎంతైనా సినిమా వాళ్లు కదా. సినమాలో మాదిరి కథలో మలుపులు.. ట్విస్టులు కోరుకుంటున్నారేమో? సాఫీగా సాగిపోవాల్సిన మూవీ ఆర్టిస్ట్ష్అసోసియేషన్ (మా) ఎన్నికల ఎపిసోడ్ తెలుగింటి సీరియల్ మాదిరి సా..గుతూ ఉంది. ఇదిగో ఎన్నికలు పెట్టేస్తున్నామన్నట్లుగా చెబుతూనే.. అంతులేని సస్పెన్స్ ను క్రియేట్ చేస్తున్న వేళ.. ప్రస్తుత కార్యవర్గంలో ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న హేమ తాజాగా ఒక వాయిస్ క్లిప్ ను రూపొందించారు. దీన్ని ‘మా’లోని 250 - 300 మందికి పంపారు. ఆ వాయిస్ క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారింది.

తానను ప్రకాశ్ రాజ్.. మంచు విష్ణుల కోసం చేస్తున్నప్రచారం కాదిది అంటూనే.. ప్రస్తుతం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నరేశ్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం పూర్తి అయ్యిందని.. వెంటనే ఎన్నికలు జరపాలంటూ ‘మా’ క్రమశిక్షణా సంఘానికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు. అందులో ‘కీ’ రోల్ ప్లే చేసేలా హేమ ఆడియో క్లిప్ ఉంది. అందరికి కామన్ గా పెడుతున్న వాయిస్ క్లిప్ అంటూ పేర్కొన్న ఆడియో క్లిప్ లో నరేశ్ పై తీవ్ర విమర్శలే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్ని వెంటనే నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంతకీ హేమ వాయిస్ క్లిప్ లో ఏముందన్నది ఆమె మాటల్లో యథాతధంగా చెబితే..

‘‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలివారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు. పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇదివరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు’’

‘‘ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు... ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అవి, ఇవీ కట్టేస్తే.. నెక్ట్స్ సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులుండవ్. జీరో అకౌంట్ అయిపోతుంది. రూ. 5 కోట్ల నుంచి జీరో అకౌంట్‌కి.. ఫ్యూచర్‌లో జరుగుతుంది. ఫ్యూచర్ అంటే ఓ నాలుగైదు సంవత్సరాలేం కాదు.. ఒక సంవత్సరంలో అయిపోతుంది’’

‘‘సో.. ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అంటే.. మీరు ఎక్కడుంటే అక్కడికి మనిషిని పంపిస్తా. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి అందరికీ నేను ఫార్వర్డ్ చేసేస్తా.. ఓకే.’’ అని పేర్కొన్నారు. హేమ మాట్లాడిన ఆడియో క్లిప్ ఫేక్ కాదని.. అది ఆమెదేనన్న విషయాన్ని ఆమె స్పష్టం చేస్తున్నారు. తామెంతో కష్టపడి ఫండింగ్ చేసిన అమౌంట్ ని ప్రస్తుత కమిటీ ఖర్చు పెడుతున్న తీరు బాధ కలిగించిందని.. అందుకే తానీ ఆడియో క్లిప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఎవరి నుంచి సరైన సమాధానం లేని వేళ.. హేమ నుంచి వచ్చిన ఆడియోక్లిప్ సంచలనంగా మారటమే కాదు.. ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ కు బలం చేకూరుతుందని చెప్పక తప్పదు.