Begin typing your search above and press return to search.

4ఏళ్ల తర్వాత థియేట్రికల్ విడుదలకు హీరో గోపీచంద్ సినిమా..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 11:30 PM GMT
4ఏళ్ల తర్వాత థియేట్రికల్ విడుదలకు హీరో గోపీచంద్ సినిమా..!
X
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనుకున్న సినిమాలు అనుకున్న టైంలో రిలీజ్ కాలేవు. అందులో ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ ఉండవచ్చు.. లేదా మేకర్స్ కారణంగా ఏదైనా ఆలస్యం కావచ్చు. కానీ దాదాపు రిలీజ్ కావాల్సిన నాలుగు సంవత్సరాలకు సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. అదిగాక సినిమాను ఆల్రెడీ జనాలు మర్చిపోయారని అర్ధమవుతుంది. కానీ తాజాగా హీరో గోపీచంద్ సినిమా నాలుగేళ్లకు విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. అదికూడా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సీనియర్ మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్’. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అయితే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్స్ నటించారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు.

వాస్తవానికి ఈ సినిమా 2012లో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. మొదటగా తమిళ దర్శకుడు భూపతి పాండియన్ దర్శకత్వంలో ప్లాన్ చేశారు. పలు కారణాల వలన భూపతి తప్పుకోవడంతో వక్కంతం వంశీ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. బి.గోపాల్ తో స్టార్ట్ చేశారు నిర్మాత తాండ్ర రమేష్. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సినిమా రిలీజ్ ఆగిపోయింది. మొత్తానికి సినిమాను సిద్ధం చేసి 2017 మేలో విడుదల చేయాలని చూశారు. ఫైనాన్సియల్ రీసన్స్ తో సినిమా కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఇటీవలి కాలంలో ఓటిటిలకు ఆదరణ పెరగడంతో ఆరడుగుల బుల్లెట్ డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నారు. అంటే సినిమా జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయింది కాబట్టి త్వరలో ప్రమోషన్స్ మొదలుపెడతారని టాక్. అలాగే ప్రస్తుతం లాక్ డౌన్ లేకపోవడంతో థియేటర్స్ తెరుచుకునే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. చూడాలి మరి ఇన్నేళ్ల తర్వాత రాబోతున్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. మరోవైపు గోపీచంద్ నటించిన సీటిమార్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.