Begin typing your search above and press return to search.

ఏపీ క‌ళాకారుల‌ను ఆదుకున్న హీరో కార్తీ

By:  Tupaki Desk   |   12 Jun 2021 3:30 PM GMT
ఏపీ క‌ళాకారుల‌ను ఆదుకున్న హీరో కార్తీ
X
క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు క‌ళారంగంపై ఆధార‌ప‌డిన‌వారు ఎంత‌టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంద‌రికీ తెలిసిందే. లాక్ డౌన్ ఆంక్ష‌లు, స‌డ‌లింపుల న‌డుమ మిగిలిన రంగాల‌కు చెందిన‌వారు అర‌కొర‌గానైనా ప‌నులు చేసుకుంటున్నారు, పొట్ట పోసుకుంటున్నారు. కానీ.. సినీ, ఇత‌ర క‌ళారంగాల‌పై ఆధార‌ప‌డిన‌వారు మాత్రం పూర్తిగా ఉపాధి కోల్పోయారు.

గ‌తేడాది లాక్ డౌన్ త‌ర్వాత.. కేవ‌లం మూడంటే మూడు నెల‌లు మాత్ర‌మే సినీ ప‌రిశ్ర‌మ ప‌నిచేసుకుంది. ఆ త‌ర్వాత సెకండ్ వేవ్ దెబ్బ‌కు దేశ‌వ్యాప్తంగా సినీరంగం మూత‌ప‌డింది. ఈ ఇండ‌స్ట్రీపై ఆధార‌ప‌డిన వేలాది మంది కార్మికులు ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్న‌ది య‌థార్థం. ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌చ్చి కార్మికుల‌కు తోచినంత‌ సాయం చేస్తున్నారు.

తాజాగా.. ఏపీకి చెందిన కూచిపూడి క‌ళాకారుల‌కు స‌హాయం చేశారు త‌మిళ హీరో కార్తీ. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు భావ‌న పెద‌ప్రోలు విజ్ఞ‌ప్తి మేర‌కు.. 50 మంది క‌ళాకారుల‌కు ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక సాయం అందించారు. ఈ డ‌బ్బు అందింద‌ని, మొత్తం 50 మంది క‌ళాకారుల అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అయ్యింద‌ని భావ‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరో కార్తీకి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. క‌రోనా క‌ష్ట కాలంలో పూట‌గ‌డ‌వ‌డానికే కళాకారులు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి నిరుపేద క‌ళాకారుల‌ను ప్ర‌ముఖులు ఆదుకోవాల‌ని కోరారు. కార్తీ ముందుకు వ‌చ్చి గొప్ప మ‌న‌సు చాటుకున్నార‌ని కొనియాడారు.