Begin typing your search above and press return to search.

అందరూ పరాయి వాళ్లేనా బోయపాటీ?

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:30 PM GMT
అందరూ పరాయి వాళ్లేనా బోయపాటీ?
X
తన ప్రతి సినిమాలోనూ పరభాషా నటీనటులకు పెద్ద పీట వేస్తుంటాడని.. వాళ్లకు కీలక పాత్రలు ఇస్తుంటాడని బోయపాటి పేరుంది. అతను చివరగా రూపొందించిన ‘జయ జానకి నాయక’లో వేరే భాషల వాళ్లు చాలామందే కనిపిస్తారు. శరత్ కుమార్.. తరుణ్ అరోరా.. వాణీ విశ్వనాథ్ లాంటి వాళ్లకు కీలకమైన పాత్రలిచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా మొదలుపెట్టిన కొత్త సినిమాలోనూ పర భాషా నటీనటుల కోసం స్పెషల్ రోల్స్ డిజైన్ చేశాడట. ‘రక్త చరిత్ర’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేయనున్నట్లు ఇంతకముందే వెల్లడైన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం తమిళ సీనియర్ హీరో ప్రశాంత్.. సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయనున్నట్లు సమాచారం. ‘దొంగ దొంగ’.. ‘జీన్స్’ లాంటి సినిమాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. ఐతే గత కొన్నేళ్లలో అతడి గురించి అందరూ మరిచిపోయారు. తమిళంలో కూడా ప్రశాంత్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది. ఇలాంటి టైంలో బోయపాటి అతడికి ఛాన్సివ్వడం విశేషమే. మరోవైపు హీరోయిన్‌ గా కెరీర్ ముగిసిపోతున్న దశలో పెళ్లి చేసుకుని సెటిలైపోయిన స్నేహ.. మళ్లీ ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఆమె ఆల్రెడీ అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఒక కీలక పాత్ర చేసింది. ఇప్పుడు బోయపాటి సినిమాలో ఆమెకు ఎలాంటి పాత్ర దక్కుతుందో చూడాలి. ఐతే ఇలాంటి పాత్రలకు తెలుగులో చాలామంది నటీనటులుండగా.. లైమ్ లైట్లో లేని వేరే భాషల వాళ్లకే బోయపాటి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాడో మరి.