Begin typing your search above and press return to search.

'మా' అధ్య‌క్షుడు నిధుల దుర్వినియోగ‌మా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:34 AM GMT
మా అధ్య‌క్షుడు నిధుల దుర్వినియోగ‌మా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుక‌లుక‌ల గురించి తెలిసిందే. గ‌త ఎల‌క్ష‌న్ ముందు.. ఆ త‌ర్వాతా ర‌క‌ర‌కాల‌ ప‌రిణామాల గురించి గుర్తు చేయాల్సిన పని లేదు. ప్ర‌తిసారీ మా అధ్య‌క్షుడిపై జీవిత రాజ‌శేఖ‌ర్- ఇత‌ర ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ ఏదో ఒక రూపంలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌లే మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో పెద్ద‌ల స‌మ‌క్షంలో రాజ‌శేఖ‌ర్ వివాదం హాట్ టాపిక్ అయ్యింది. మా ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఆయ‌న లేఖ‌ను స‌మ‌ర్పించ‌డం ఆ త‌ర్వాత క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం దానిని ఆమోదించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

అయితే ఈ వివాదం ఇక్క‌డి తో స‌ద్ధు మ‌ణిగిందా? అంటే.. మ‌రోసారి `మా`లో గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మా అధ్య‌క్షుడు న‌రేశ్ పై ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు చేశారు. `మా` అభివృద్ధికి న‌రేశ్ అడ్డంకి మారార‌ని.. నిధులు దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఫిర్యాదు చేశారు. న‌రేశ్ .. మా ఈసీ స‌భ్యుల్ని తీవ్రంగా అవ‌మానించార‌ని క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి అంద‌జేసిన తొమ్మిది పేజీల లేఖ‌లో పేర్కొన్నారు.

న‌రేశ్ ఒంటెద్దు పోక‌డ‌తో మా పూర్తిగా న‌ష్ట‌పోతోందని .. స‌భ్యుల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో న‌రేష్ లేర‌ని ఆరోపిస్తూ మా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత ఆ లేఖ‌లో పేర్కొన్నారని తెలుస్తోంది. అధ్య‌క్షుడు న‌రేశ్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా జీవిత రాజ‌శేఖ‌ర్ ఈ లేఖ‌లో కోరారు. అలాగే మా నిధుల్ని త‌న స‌న్నిహితుల‌కు త‌ర‌లిస్తున్నార‌న్న ఆరోప‌ణ చేయ‌డం వేడెక్కిస్తోంది. వెంట‌నే న‌రేశ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ లేఖ‌లో డిమాండ్ చేయ‌డంపై చ‌ర్చ సాగుతోంది. రాజ‌శేఖ‌ర్ క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం పై చ‌ర్య‌లు తీసుకున్న క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం న‌రేశ్ పైనా అలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందా? ఈ ఆరోప‌ణ‌ల్లో నిజానిజాలేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుందా? అన్నది చూడాలి.