Begin typing your search above and press return to search.

రామ్ ఇప్ప‌టికైనా ఆ మాయ నుండి బ‌య‌ట‌ప‌డ‌తాడా?

By:  Tupaki Desk   |   18 July 2022 8:30 AM GMT
రామ్ ఇప్ప‌టికైనా ఆ మాయ నుండి బ‌య‌ట‌ప‌డ‌తాడా?
X
టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వై.వి.ఎస్.చౌదరి తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ మూవీ 'దేవ‌దాసు'తో గ్రాండ్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన రామ్ పోతినేని.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. క్లాస్ మూవీస్ తో చాక్లెట్ బాయ్ గా ముద్ర వేయించుకున్నాడు. అయితే ఒకానొక ద‌శ‌లో రామ్ వ‌రుస ఫ్లాపుల్లో మునిగిపోయాడు. ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి.

అలాంటి స‌మ‌యంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' వంటి మాస్ మూవీ చేసి త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు రుచి చూపించాడు. 2019లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో.. రామ్ త‌న ఫోక‌స్ మొత్తాన్ని మాస్ చిత్రాల‌వైపే మ‌ల్లించాడు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత వ‌చ్చిన 'రెడ్‌' మాస్ నేపథ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మే. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. 2021లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయినా రామ్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. తాజాగా 'ది వారియ‌ర్‌' వంటి మ‌రో మాస్ ఎంట‌ర్టైన‌ర్ తో వ‌చ్చాడు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్‌. లింగుసామి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలి షో నుండే నెగ‌టివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది.

ఒక రొటీన్ కమర్షియల్ సినిమా అంటూ చాలా మంది పెద‌వి విరిచారు. అయితే నెగటివ్ టాక్‌ వచ్చినప్పటికీ మాస్ సినిమా కాబట్టి బీసీ సెంటర్స్ లో ఈ మూవీ బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. అయినాస‌రే నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

ఇక ఈ మూవీ అనంత‌రం రామ్ ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదీ మాస్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న చిత్ర‌మే. అయితే వ‌రుస ఫ్లాపులు ప‌డుతుండ‌టంతో.. రామ్‌-బోయపాటి సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని అభిమానులు క‌ల‌వ‌ర ప‌డుతున్నారు. మ‌రోవైపు అతిగా మాస్ చిత్రాల వెంట‌ ప‌డి బొక్క బోర్లా పడ‌టం కంటే.. క్లాస్ చిత్రాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తే మంచిద‌ని రామ్ కు ప‌లువురు హిత‌వు ప‌లుకుతున్నారు. మరి ఇప్ప‌టికైనా మాస్ చిత్రాల మాయ నుండి రామ్ బ‌య‌ట‌ప‌డ‌తాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.