Begin typing your search above and press return to search.

వ్యాఖ్యలతో చిచ్చు రేపిన హీరో సూర్య

By:  Tupaki Desk   |   17 July 2019 5:41 AM GMT
వ్యాఖ్యలతో చిచ్చు రేపిన హీరో సూర్య
X
రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మొత్తం వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే దేశ విద్యారంగాన్ని సమూలంగా మార్చాలని ఇటీవల కమిటీ ఏర్పాటు చేయగా దాని రిపోర్టు వచ్చేసింది.

కేంద్రం ప్రవేశపెట్టే జాతీయ విద్యావిధానంలో ఇంటర్మీడియెట్ చదువులను తీసేస్తున్నారు. అంతేకాదు.. జాతీయ విద్యావిధానం వల్ల ప్రాంతీయ భాష విద్యార్థులకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. ఉత్తరాధి హిందీ మాట్లాడే వారికే లబ్ధి చేకూరుస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం నూతన విద్యావిధానంపై తమిళ అగ్రహీరో సూర్య సంచలన కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల సూర్య తన తండ్రి శివకుమార్ ట్రస్ట్, సూర్య ఆగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతిలో అత్యధిక మార్కులు పొందిన పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్య కేంద్రం తీసుకువస్తున్న విద్యావిధానం బాగాలేదని తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్షలు ఉత్తరాధి వారికే లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు.

సూర్య వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీనిపై బీజేపీ భగ్గుమంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా సూర్య వ్యాఖ్యలను ఖండించారు. హింసను ప్రేరేపిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర్యరాజన్ అయితే విద్యావిధానం గురించి తెలియని సూర్యలాంటి వారు దాని గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అందరికీ విద్యను అందించాలన్నదే బీజేపీ అభిమతమని.. అందుకే కొత్త విద్యావిధానాన్ని తీసుకొస్తుందన్నారు. ఏమీ తెలియని సూర్య అరకొరగా చెప్పే విమర్శలకు తాను బదులు ఇవ్వనని రాష్ట్రమంత్రి కంబూరు రాజు సూర్యను ఎద్దేవా చేశారు.

ఇక సూర్య అనుకూల వర్గం మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థించింది. సూర్య ఎంతో మందిని చదివిస్తున్నారని.. విద్యావిధానం గురించి మాట్లాడే హక్కు ఆయనకు ఉందని మద్దతుగా నిలుస్తున్నారు.