Begin typing your search above and press return to search.

కోర్టులో తాడో పేడో తేలుద్దాం- విశాల్

By:  Tupaki Desk   |   21 Jun 2019 5:02 AM GMT
కోర్టులో తాడో పేడో తేలుద్దాం- విశాల్
X
న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల హ‌డావుడి గురించి తెలిసిందే. నాజ‌ర్ - విశాల్ ప్యానెల్ పై నెగ్గేందుకు భాగ్య‌రాజా ప్యానెల్ తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో భాగ్య‌రాజా రెండు విష‌యాల్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకుని విశాల్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఒక‌టి తంబీల‌పై తెలుగు వాడైన విశాల్ పెత్త‌న‌మేంటి? అన్న‌ది కాగా.. రెండోది న‌డిగ‌ర సంఘం భ‌వంతిని నిర్మిస్తాన‌న్న విశాల్ ఆ ప‌నిని ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయారు? అన్న‌ది వేరొక నినాదం. ఆ రెండు పాయింట్ల‌తో విశాల్ బృందాన్ని భాగ్య‌రాజా ప్యానెల్ ఓడించేందుకు ప‌న్నాగం ప‌న్నింది.

అయితే ఊహించ‌ని రీతిలో నిన్న‌టిరోజున న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల్ని ర‌ద్దు చేస్తూ రిజిస్ట్రార్స్ ఆఫ్ సొసైటీ ఆక‌స్మిక‌ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. దాదాపు 61 మంది ఆర్టిస్టుల స‌భ్య‌త్వంపై సందేహాలున్నాయంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై నిజానిజాలేంటో తేలాల్సిందేన‌ని రిజిస్ట్రార్స్ సొసైటీ ఆంక్ష‌లు విధించింది. ఈ ప‌రిణామం విశాల్ ప్యానెల్ గెలుపును డైల‌మాలో ప‌డేసింది.

అయితే ఎన్నిక‌లు క్యాన్సిల్ చేయడంపై కోర్టులో పోరాడేందుకు తాజాగా విశాల్ రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఈనెల 26న జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి కాబ‌ట్టి త‌దుప‌రి కోర్టు కేసుల‌తో ఎప్ప‌టికి తేల్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మరోవైపు విశాల్ గెలుపుపైనా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ ఓట‌మికి ఎలాంటి కార‌ణాల్ని విశాల్ చెప్పాడో అలాంటి కార‌ణాలే అత‌డికి అడ్డంకిగా మార‌నున్నాయా? అవే అంశాలు ఈసారి విశాల్ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతాయా? .. అంటూ ఆర్టిస్టుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. విశాల్ వెంట ఉన్న‌వారిలో 61 మంది స‌భ్య‌త్వంపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయా? అంటే అవున‌నే సందేహాలు అలుముకున్నాయి. న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)ని మించి వేడెక్కించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.