Begin typing your search above and press return to search.

పాస్ట‌ర్ గా మారిన హీరో... కార‌ణం ఏంటీ?

By:  Tupaki Desk   |   7 Jun 2022 6:50 AM GMT
పాస్ట‌ర్ గా మారిన హీరో... కార‌ణం ఏంటీ?
X
తెలుగులో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజా. 'ఓ చిన‌దాన‌', శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన 'ఆనంద్‌', దేవా క‌ట్టా రూపొందించిన 'వెన్నెల‌' వంటి చిత్రాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. హీరోగా న‌టిస్తూనే ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్లో స్టార్ హీరోల సినిమాల్లోనూ న‌టించారు. అయితే క్ర‌మ క్ర‌మంగా రాజాకు హీరోగా క్రేజ్ త‌గ్గుతూ వ‌చ్చింది. దీంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ సినిమాలు చేస్తూ వ‌చ్చారు. స్టార్ హీరోలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'బంగారం', సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'అర్జున్‌' వంటి చిత్రాల్లో ప్రాధాన్య‌త వున్న పాత్రల్లో న‌టించి మెప్పించారు.

అయితే మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ న‌టుడిగా బిజీగా వున్న స‌మ‌యంలోనే రాజా స‌డ‌న్ గా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. దివంగ‌త కాంగ్రెస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ త‌రువాత వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ ఆక‌స్మికంగా మృతి చెంద‌డంతో కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ త‌రువాత కొంత మంది నేతలు క్రియాశీల రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొన‌లాని సూచించినా రాజా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌.

ఆ త‌రువాత ఆయ‌న క్రిస్టియానిటీని స్వీక‌రించి మ‌త ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఏకంగా పాస్ట‌ర్ గా మారి మ‌త ప్ర‌చార‌కుడిగా ఎంతో మందిని ప్ర‌భావితం చేస్తున్నారు. కంప్లీట్ గా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. స్పిరిచువ‌ల్ స్పీక‌ర్ గా త‌న‌దైన పంథాలో ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల సినిమాల‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌తో రాజా వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. 'ప‌నికి మాలిన సినిమాలు ఎందుకు చూస్తార‌య్యా' అంటూ రాజా చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్స్ రాజాని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

సినిమాల ద్వారా ఎదిగి ఇప్ప‌డు అదే సినిమాల‌ని అవ‌మానిస్తున్నావంటూ రాజాని ఏకి పారేశారు. ఇదిలా వుంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ఇండ‌స్ట్రీకి దూరంగా ఎందుకు వుంటున్నానో, సినిమాల‌ని ఎందుకు వ‌దిలేశానో, త‌ను పాస్ట‌ర్ గా ఎందుకు మారాల్సి వ‌చ్చిందో వంటి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రాజా వెల్ల‌డించారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారిపై వున్న అభిమానం వ‌ల్లే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు. ఆయ‌న కార‌ణంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని వెల్ల‌డించారు. అయితే వైఎస్ మ‌ర‌ణం త‌రువాత త‌న‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పోయింద‌ని, దాంతో తాను కాంగ్రెస్ పార్టీ ని వీడాన‌ని తెలిపారు.

ఇదిలా వుంటే త‌న‌కు సినిమాల‌పై, జీవితంపై విరక్తిని క‌లిగించే సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, త‌న వ‌ద్ద ప‌ని చేసే డ్రైవ‌ర్ త‌న‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని, అతను ఇబ్బందుల్లో వున్నాడ‌ని తెలిసి 7 ల‌క్ష‌లు ఇచ్చాన‌ని, తాను డ‌బ్బులు ఇచ్చిన మ‌రుస‌టి రోజు నుంచే అత‌ను త‌న వ‌ద్ద ప‌ని మానేసి క‌నిపించ‌కుండా పోయాడ‌ని, ఆ త‌రువాత అలాంటి మోసాల‌ని ఎన్నింటినో ఎదుర్కొన్నాన‌ని, వాటి వ‌ల్ల జీవితంపై త‌న‌కు విర‌క్తి ఏర్ప‌డింద‌ని చెప్పుకొచ్చారు. చివ‌రికి త‌న‌కు జీసెస్ స‌న్నిధి ప్ర‌శాంత‌త‌ని క‌లిగించిందని, ప్ర‌స్తుతం త‌న జీవితం హాయిగా సాగిపోతోంద‌ని త‌ను పాస్ట‌ర్ గా మార‌డం వెన‌కున్న అసలు విష‌యాన్ని వెల్ల‌డించారు రాజా.