Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ మాట.. ఆ హీరోయిన్లందరూ ఖుషీనే

By:  Tupaki Desk   |   21 Dec 2017 1:30 AM GMT
త్రివిక్రమ్ మాట.. ఆ హీరోయిన్లందరూ ఖుషీనే
X
తెలుగు సినిమాల్లో నటించే పర భాషా కథానాయికలకు ఒకప్పుడు ఒక్క ముక్క తెలుగు వచ్చేది కాదు. ఐదేళ్లు.. పదేళ్లు ఇక్కడ సినిమాలు చేసినా తెలుగు నేర్చుకునేవాళ్లు కాదు. నాలుగు ముక్కలు తెలుగు మాట్లాడటమే కష్టమైతే.. ఇక డబ్బింగ్ ఎక్కడ చెప్పుకుంటారు..? కానీ ఈ తరం కథానాయికలు అలా కాదు. ఇప్పుడు చాలామంది తెలుగు చక్కగా మాట్లాడేస్తున్నారు. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. ఈ కోవలోకే కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ కూడా చేరారు. వీళ్లిద్దరూ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. దీని గురించి ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో చాలా బాగా చెప్పాడు త్రివిక్రమ్.

హీరోయిన్లు తమకు తాము డబ్బింగ్ చెప్పుకోవడం పెద్ద విషయమా అని చాలామందికి అనిపించొచ్చని.. కానీ అది నిజంగా పెద్ద విషయమే అని త్రివిక్రమ్ అన్నాడు. ఇందుకు ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ‘‘మనం హోటల్ రిసెప్షన్లోకి వెళ్తే.. ఎక్స్ క్యూజ్ మి అనడానికి రెండు నిమిషాలు ఆలోచిస్తాం.. ఎక్స్ క్యూజ్ మి అంటే కరెక్టా కాదా అని. అలాగే ‘మే ఐ’ అనాలా.. ‘షల్ ఐ’ అనాలా అని మనకు డౌట్ వస్తుంటుంది. మనకు రాని ఒక భాష విషయంలో అంత ఇబ్బంది పడతాం. అలాంటిది ఎక్కడో వేరే దేశంలో పుట్టిన ఒక అమ్మయి.. వేరే రాష్ట్రంలో పుట్టిన ఒక అమ్మాయి.. అక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చి.. మన భాషను అర్థం చేసుకుని డైలాగులు చెప్పి.. అర్థం చేసుకుని పెర్ఫామ్ చేశారు.. అంటే మనం వాళ్లకు ఎంత గౌరవం ఇవ్వాలి. అందుకే వాళ్లిద్దరినీ నేను గౌరవిస్తున్నాను’’ అని త్రివిక్రమ్ అన్నాడు. మొత్తానికి వేరే రాష్ట్రం నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న ప్రతి కథానాయికకూ త్రివిక్రమ్ మాటలు ఎంతో ఆనందాన్నిచ్చి ఉంటాయనడంలో సందేహం లేదు.