Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అందుకేనా?

By:  Tupaki Desk   |   7 July 2017 12:30 AM GMT
తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అందుకేనా?
X
సీనియర్ నటులకు తరచుగా ఇంటర్వ్యూల్లో ఎదురయ్యే ప్రశ్న ఇదే. ఇప్పటి సినిమాలకు.. గతంలో వచ్చిన సినిమాలకు తేడా ఏంటని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానాలు వాళ్ళ వాలా అనుభవాన్ని బట్టి ఆలోచనల శైలి బట్టి వస్తుంటాయి. టెక్నాలజీ సంగతి వదిలేస్తే.. సినిమా మారుతోంది.. ఆ మార్పులో మనం భాగంగా ఉన్నాం అనే భ్రమలో మన తెలుగు సినిమా ప్రయాణం సాగుతోంది. కొత్త నీరు వస్తున్నా పాత పాటే పాడుతున్నారు. మన సినిమాలలో ముఖ్యంగా మసాలా మూవీస్ లో కథానాయక తీరు మారలేదు. అందాలు చూపిస్తూ డ్రెస్సులు వేసుకుని హీరో వెనకాల తిరగడమే హీరోయిన్స్ పని. అందం చూపించడం మినహా.. అంతకు మించి వాళ్ళు చేసే పనేమీ లేకుండా మన కథలు ఉంటున్నాయి.

కథానాయకల పాత్రలను ఎప్పటి నుండో ఇలానే రాస్తున్నారు. అసలు వాళ్ళ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారు అనడం కూడా దండగే. వాళ్ళను తీసుకున్నది అందాల ఆరబోతకు తప్ప.. అభినయం కోసం కాదన్నట్లుగా ఉంటుంది వాలకం. ఈ మధ్యే విడుదలైన కొన్ని సినిమాల్లో కూడా అంతే. యంగ్ డైరెక్టర్లు కూడా అలానే రాస్తున్నారు.. తీస్తున్నారు. హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది. కానీ సినిమా మొత్తం ఒక్కదగ్గర కూడా దాని ప్రస్తావన రాదు.. అవసరం ఉండదు. ఘంటా రవిని హీరోగా పరిచయం చేసిన ‘జయదేవ్’ సినిమాలో కూడా పోలీసు స్టేషన్ కు హీరోయిన్ ఒక హాఫ్ టాప్ డ్రెస్స్ వేసుకొని వస్తుంది. మొత్తం సినిమా అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అతని వెనకాల ‘అమ్మో’ అని నిలబడుతుంది హీరోయిన్. అలాగే ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో పూజ హెగ్డే కూడా స్క్రీన్ పై అందం కనిపించాలి కదా అని పెట్టుకున్నట్లుగా ఉంటుంది తప్ప.. నటన కోసం కాదని చెప్పచ్చు. ఇందులో కూడా పై చదువులు కోసం విదేశాలకు వెళ్ళాలి హీరోయిన్.. కానీ రెండున్నర గంటల సినిమాలో ఆ ఊసే లేదు. అలాగే కొద్ది రోజులు కిందట విడుదలైన ‘కేశవ’ లో కూడా రీతూ వర్మ 'లా' చదువుతుంది. కానీ ఆమె చదువు హీరో పై ప్రయోగిస్తుంది తప్ప.. సినిమా కథ పై ఎటువంటి ప్రభావం చూపదు. సమ్మర్ లో వచ్చిన ‘రాధ’ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా.. హీరో సరసం అడటానికి ఒక అమ్మాయి ఉండాలి కదా అని తీసుకున్నట్లు ఉంటుంది.

అది మరీ మన తెలుగు సినిమా తీరు. ఇప్పుడు ఉన్న అల్ట్రా మోడ్రన్ ఏజ్ లో ఇలాంటి మూసపోత పద్దతిలో కథలు రాసి.. హీరోయిన్ ను ఒక బిజినెస్ ఎలిమెంట్ గా భావించి సినిమాలు తీస్తే చూసే వాళ్ళకి కూడా అంతా ఆసక్తి ఉండడం లేదు. ఇంకొన్నాళ్లు పోతే ఆ సినిమాని ఎంత పెద్ద స్టార్ నటించినా.. ఎంత పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేసిన థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ పరిణామాలు రాకుండా ఉండాలి అంటే ఈ పద్దతి మార్చుకోక తప్పదు.​