Begin typing your search above and press return to search.

సారీ నో కామెంట్స్: హీరోయిన్లంతా అదే మాట‌

By:  Tupaki Desk   |   13 April 2018 7:04 AM GMT
సారీ నో కామెంట్స్:  హీరోయిన్లంతా అదే మాట‌
X

శ్రీ‌రెడ్డి ఉదంతం త‌ర్వాత టాలీవుడ్ ను కాస్టింగ్ కౌచ్ వివాదం కుదిపేస్తోంది. రోజురోజుకీ రెచ్చిపోతూ... ఏ మాత్రం త‌గ్గ‌కుండా నానా ర‌చ్చ చేస్తోంది శ్రీ‌రెడ్డి. ఆమెకు స‌పోర్టుగా కొంత మంది నటీమ‌ణులు కూడా ఇక్క‌డ కాస్టింగ్ కౌచ్ ఉన్న‌ద‌ని నిజ‌మ‌ని ‘మీ టూ’ అని ముందుకొస్తున్నారు. ఇన్నాళ్లు ఆఫ‌ర్ల కోసం ఎదురుచూసిన హీరోయిన్లు కూడా... ఇప్పుడు బ‌య‌ట క‌నిపిస్తే కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతారేమో అని భ‌య‌ప‌డుతుండ‌డం విశేషం.

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా అయితే ఓ జూనియ‌ర్ న‌టికి కాస్టింగ్ కౌచ్ స‌మస్య ఎదురైంద‌ని- ఆమె ఆ వ్య‌వ‌హారం గురించి త‌న ద‌గ్గ‌రి కొచ్చి స‌ల‌హా అడిగింద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు ఇలియానా టాలీవుడ్ కి దూరం. బాలీవుడ్ లో అప్పుడ‌ప్పుడు ఒక‌టి అరా సినిమాలు చేసుకుంటూ బాయ్ ఫ్రెండ్ తో జాలీగా గడుపుతోంది ఇల్లీ బేబీ. దాంతో కాస్త ఘాటుగానే స్పందిస్తోంది. ఇక‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏమో... ‘నేను చాలా గ‌ట్టిదాన్ని. న‌చ్చ‌క‌పోతే నో చెప్ప‌గ‌ల‌ను. న‌న్నెవ‌రూ బ‌ల‌వంత పెట్టలేరు’ అంటూ త‌న గురించి పెద్ద డ‌బ్బానే కొట్టేసుకుంది. మ‌రో హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ కీ- శ్రీ‌రెడ్డికీ మ‌ధ్య చాలా పెద్ద ర‌చ్చే జ‌రిగింది. ‘నాకు ఎటువంటి కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు ఎదురుకాలేదు... టాలీవుడ్ లో హీరోయిన్ల‌ ప‌రిస్థితి చాలా బాగుంది’ అంటూ ర‌కుల్ చేసిన కామెంట్ల‌పై పెద్ద ర‌చ్చే చేసింది శ్రీ‌రెడ్డి. బూతులు తిడుతూ విరుచుకుప‌డింది. దీంతో ఈ విష‌యం గురించి మాట్లాడ‌లంటేనే హీరోయిన్లు భ‌య‌ప‌డిపోతున్నారు.

మీడియా ముందుకు వ‌స్తేనే ఈ వ్య‌వ‌హారం గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంటుంది అనే రోజులు కూడా కావివి. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో లైవ్ లోకి వ‌చ్చినా... రాక‌పోయినా మెసేజ్‌ ల‌తో హీరోయిన్లంద‌రినీ కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతున్నారు నెటిజ‌న్లు. దీంతో ఏం చేయాలో అర్థం కాక సోష‌ల్ మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు కొంద‌రు హీరోయిన్లు. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం గురించి లైవ్ లో అభిమానుల నుంచి ఇటువంటి ప్ర‌శ్న‌లు ఎదురైనా... చాలా కూల్ గా ‘నో కామెంట్స్’ అనేస్తున్నారు కొంతమంది భామలు.