Begin typing your search above and press return to search.

కొత్త రూట్‌ లో నడుస్తున్న అందగత్తెలు

By:  Tupaki Desk   |   9 April 2019 5:30 PM GMT
కొత్త రూట్‌ లో నడుస్తున్న అందగత్తెలు
X
ఈమద్య కాలంలో హీరోలు ప్రొడక్షన్‌ హౌస్‌ లు ప్రారంభించడం చిన్న, పెద్ద సినిమాలను నిర్మించడం మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు ఎంతో మంది హీరోలు ఇప్పటి వరకు నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరోల దారిలో హీరోయిన్స్‌ కూడా నడుస్తున్నారు. అప్పట్లోనే సావిత్రి వంటి వారు నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించారు. అయితే ఆ తర్వాత తరం హీరోయిన్స్‌ ఎవరు కూడా నిర్మాణంపై ఆసక్తి చూపించలేదు. హీరోయిన్‌ గా కెరీర్‌ ను కాపాడుకునేందుకు వారికి సరిపోయింది. కాని ఇప్పుడు హీరోయిన్స్‌ అలా కాదు, హీరోయిన్‌ గా చేస్తూనే నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నారు.

గతంలో కొందరు హీరోయిన్స్‌ అవకాశాలు లేని సమయంలో నిర్మాణ రంగంలోకి, ఇతర రంగాల్లోకి వెళ్లే వారు. కాని ఇప్పుడు హీరోయిన్స్‌ మాత్రం హీరోయిన్‌ గా స్టార్‌ స్టేటస్‌ ఉన్న సమయంలోనే నిర్మాణంలో అడుగు పెడుతున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ప్రియాంక చోప్రా, దీపిక పదుకునే వంటి వారు నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇక సౌత్‌ లో చూసుకుంటే కొత్తగా కాజల్‌, తమన్నా, శృతి హాసన్‌, అమలా పాల్‌ ఇంకా కొంత మంది హీరోయిన్స్‌ నిర్మాణంలోకి అడుగు పెడతున్నారు.

కాజల్‌ నిర్మాణంలో తమన్నా సమర్పణలో 'అ!' చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పని కూడా జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుంది. ఇక తమిళనాట అనూప్‌ పణిక్కర్‌ దర్శకుడిగా కడవేర్‌ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాను కథపై నమ్మకంతో అమలా పాల్‌ నిర్మించేందుకు సిద్దం అయ్యింది. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తక్కువ ఉన్నా, ఆసక్తికర స్క్రీన్‌ప్లే తో ఈ చిత్రం తెరకెక్కుతుందట. అందుకే అమలా పాల్‌ ఈ చిత్రంను నిర్మిస్తోంది.

ఇక కమల్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్‌ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే మల్టీ ట్యాలెంట్‌ అనిపించుకున్న శృతి హాసన్‌ ఇప్పుడు నిర్మాతగా మారి తన సత్తా చాటబోతుంది. జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ది మస్కిటో ఫిలాసఫీ' అనే చిత్రంను శృతి హాసన్‌ విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలో తన సొంత నిర్మాణంలో మరో సినిమాను కూడా నిర్మించాలని ఆశ పడుతోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ లు, షార్ట్‌ ఫిల్మ్‌ లను కూడా నిర్మించేందుకు హీరోయిన్స్‌ ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి ఈతరం హీరోయిన్స్‌ చేస్తున్న ఆలోచనను అభినందించాల్సిందే.