Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుకు హైకోర్టు ఓకే

By:  Tupaki Desk   |   5 Jan 2018 4:19 AM GMT
సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుకు హైకోర్టు ఓకే
X
ప్ర‌తిది పెరుగుతోంది. భారం ఎక్కువ‌వుతోంది. మా జీతాలు పెర‌గ‌వు కానీ.. చుట్టూ ఉన్న‌వ‌న్నీ పెరుగుతున్నాయ‌న్న మాట చెప్పే వారికి మ‌రింత చిరాకు క‌ల‌గ‌నుంది. కొంత‌కాలంగా పెర‌గ‌ని సినిమా థియేట‌ర్ టికెట్ ధ‌ర‌లు మ‌రింతగా పెర‌గ‌నున్నాయి. సినిమా థియేట‌ర్ టికెట్ ధ‌ర‌ల్ని పెంచేందుకు ఉమ్మ‌డి హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

టికెట్ ధ‌ర‌లు పెంచాలంటూ కొంద‌రు సినిమా థియేట‌ర్ల య‌జ‌మానులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో టికెట్ ధ‌ర‌లు పెంచుకునేలా ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరారు. దీనిపై స్పందించిన ఉమ్మ‌డి హైకోర్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధ‌ర‌ల్ని పెంచుకోవ‌టానికి వీలుగా అనుమ‌తినిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్ని జారీ చేసింది. అదే స‌మ‌యంలో అన్ని త‌ర‌గ‌తుల ప్ర‌తిపాదిత టికెట్ల ధ‌ర‌ల స‌మాచారాన్ని సంబంధిత అధికార యంత్రాంగానికి ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

పెంచిన టికెట్ ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ప‌న్ను చెల్లించాల‌ని పేర్కొంది. తాము ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లవుతున్నాయో లేదో జాయింట్ క‌లెక్ట‌ర్ ప‌ర్య‌వేక్షించాల‌ని.. దీనిపై నివేదిక‌ను స‌మ‌ర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాలంటూ త‌ర్వాతి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 1కు వాయిదా వేసింది. సినిమా హాళ్ల‌లో టిక్కెట్ ధ‌ర‌ల్ని పెంచాలంటూ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుకు ప్ర‌భుత్వం త‌గిన నిర్ణ‌యం తీసుకోవ‌టం లేద‌ని.. జీవో జారీ చేసే లోపు ధ‌ర‌ల్ని పెంచుకోవ‌టానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరుతూ సినిమా థియేట‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించాయి. దీంతో స్పందించిన న్యాయ‌స్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌లు పెంచినా పెంచ‌కున్నా.. ఉమ్మ‌డి హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో టిక్కెట్ ధ‌ర‌లు పెర‌గ‌నుండ‌టం ఖాయం. అదే జ‌రిగితే.. ఈ సంక్రాంతి ముందు నుంచే థియేట‌ర్లు టికెట్ ధ‌ర‌ను పెంచ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.అతి త్వ‌ర‌లోనే సినీ అభిమానుల జేబుల‌కు మ‌రింత భారం ప‌డ‌నుంద‌న్న మాట‌.