Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ నిషేధంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   22 Jun 2023 9:36 AM GMT
ఆదిపురుష్ నిషేధంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌
X
ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ ఇప్ప‌టికే 380కోట్లు వ‌సూలు చేసి 400కోట్ల క్ల‌బ్ లో అడుగుపెడుతోంది. వ‌సూళ్లు అంత‌కంత‌కు దిగ‌జారడానికి కార‌ణం బ్యాడ్ మౌత్ టాక్. మ‌రోవైపు ఈ సినిమాని వివాదాలు విడిచిపెట్ట‌డం లేదు.

ఆదిపురుష్ ఉత్తర భారతదేశంలోని హిందూ సాంప్ర‌దాయ‌ వర్గం నుండి తీవ్ర‌ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆదిపురుష్ పై తక్షణమే నిషేధం విధించాలని ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.

రామాయణం పవిత్రతను కించపరిచే విధంగా ఈ సినిమాని తెర‌కెక్కించారని పవిత్ర శ్రీరామ‌క‌థను త‌ప్పుగా చూపించాడని ఫిర్యాదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య చేసింది. ''ఈ కేసులో అత్యవసర పరిస్థితి లేదు. దానిపై తక్షణ విచారణకు పిలవలేము. తదుపరి నోటీసు వచ్చే వరకు మేము స్క్రీనింగ్ లను ఆపము'' అని కోర్టు పేర్కొంది. కేసు విచారణను జూన్ 30కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

మొత్తానికి ఈ తీర్పు ఆదిపురుష్ టీమ్ కి పెద్ద ఊర‌ట‌. తక్షణ ముప్పు కాదని కోర్టు నిర్ణయించింది కాబ‌ట్టి హిందూవాదులు ఇక సైలెంట్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది. నిజానికి ఆదిపురుష్ వ‌సూళ్లు ఇప్ప‌టికే త‌గ్గుద‌ల దిశ‌గా ఉన్నాయి.

జూన్ 30 నాటికి ఆదిపురుష్ ర‌న్ అంతా ముగిసిపోవచ్చు కాబట్టి ఈ కోర్టు కేసు చిత్రానికి పెద్ద సమస్య కానేకాదు. అయితే మొదట్లో ఉత్తరాదిలో హిందుత్వ వేవ్ తో భారీ హిట్టవుతుంద‌ని భావిస్తే తానొకటి త‌ల‌చిన చందంగా ఓంరౌత్ అతిపెద్ద త‌ప్పిదాలు ప్రభాస్ అభిమానుల‌ను ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి.