Begin typing your search above and press return to search.

ఆక్రమణలపై తమిళ హీరోకి హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   22 Jun 2016 3:36 AM GMT
ఆక్రమణలపై తమిళ హీరోకి హైకోర్టు నోటీసులు
X
మాధవన్ పేరు చెప్పగానే చాలామంది కుర్రకారులో జోష్ వస్తుంది. ఆ రేంజ్ లో యూత్ లో స్థానం సంపాదించిన ఈ హీరో.. ఇప్పుడు కాస్త సీనియర్ అయిపోయాడు లెండి. అటు తమిళ్ ఇటు హిందీ చిత్రాలను బ్యాలెన్స్ చేసేస్తూ కెరీర్ ని బాగానే లాక్కొచ్చేస్తున్నాడు. ఈ మధ్యనే సాలా ఖద్దూస్ అంటూ మంచి హిట్ నే కొట్టిన మాధనవ్ కు.. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కావడంతో.. మాధవన్ బాగానే ఇరుక్కున్నాడని తెలుస్తోంది. మార్చ్ 16, 2015న దిండిగల్ జిల్లాలో 4.88 ఎకరాల స్థలాన్ని కొనగా.. తన స్థలానికి ఆనుకుని ఉన్న ఓ వాటర్ ఛానల్ ని కూడా దాదాపుగా ఆక్రమించేశాడట. ఈ మేరకు ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. మాధవన్ ఆక్రమణ కారణంగా.. అయ్యంపౌలి, బాలసముద్రం అనే రెండు గ్రామాలకు నీటి సరఫరా ఇబ్బందులు ఏర్పడ్డాయని.. తక్షణమే అతని అరాచకాన్ని అరికట్టాలని కోర్టుకు తెలిపాడు పిటిషనర్.

అంతే కాకుండా.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కొబ్బరి - జామ తోటలను కూడా మాధవన్ ఆక్రమించాడని పిటిషనర్ హైకోర్టుకు తెలిపాడు. ఈ కేసును విచారణకు స్వీకరించిన మద్రాస్ హై కోర్టు.. జూలై 11న మరుసటి విచారణ చేయనున్నట్లు తెలుపుతూ.. మాధవన్ కు నోటీసులు జారీచేసింది. ముంబైలో మాధవన్ నివాసం ఉంటున్న ఇంటికి కూడా ప్రైవేట్ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.