Begin typing your search above and press return to search.

ఆ కేసు ఇంకా ఉంది.. ఇళయరాజా క్లారిటీ

By:  Tupaki Desk   |   1 Nov 2018 10:58 AM GMT
ఆ కేసు ఇంకా ఉంది.. ఇళయరాజా క్లారిటీ
X
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా వ్యవహరిస్తున్న తీరు చాలా మందికి మింగుడు పడటం లేదు. ఎన్నో అద్బుతమైన పాటలను ట్యూన్‌ చేసి కేవలం తమిళం - తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా తన పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించిన ఇళయరాజా ఇప్పుడు తన పాటలపై కాపీ రైట్‌ కోసం కోర్టును ఆశ్రయించాడు. 2014వ సంవత్సరంలో ఇళయరాజా తాను ట్యూన్‌ చేసిన పాటలను ఏ ఒక్కరు కూడా వినియోగించేందుకు - ఏ కార్యక్రమంలో అయినా పాడుకునేందుకు లేదు అంటూ కోర్టులో పిటీషన్‌ వేశాడు.

గత నాలుగు సంవత్సరాలుగా కోర్టులో ఇళయరాజా కాపీ రైటు పిటీషన్‌ పై విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో తమిళ మీడియాలో ఇళయరాజా వేసిన కాపీరైట్‌ కేసును హైకోర్టు కొట్టి వేసిందని - ఆ కేసులో ఇళయరాజాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఇవే వార్తలను ప్రసారం చేస్తున్నాయి. తన కాపీరైట్‌ కేసు కొట్టి వేశారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఇళయరాజా ఖండించారు. తాను 2014లో వేసిన కాపీరైట్‌ కేసు ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నాడు.

తాను 2010వ సంవత్సరంలో ఎకో రికార్డింగ్‌ సంస్థ పై వేసిన కేసును తాజాగా కోర్టు కొట్టి వేయడం జరిగిందని ఇళయరాజా పేర్కొన్నాడు. నేను అప్పట్లో వేసిన కేసుపై ఎకో రికార్డింగ్‌ సంస్థ రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది. ఆ కేసులో వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ కేసు విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాని కాపీ రైట్‌ కేసును కొట్టి వేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు కథనాన్ని ప్రసారం చేయడం పట్ల ఇళయరాజా మండి పడ్డాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలను ప్రసారం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నాలుగు సంవత్సరాలుగా కాపీ రైట్‌ కేసు విషయంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. త్వరలోనే నాకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను అంటూ ఇళయరాజా కాపీ రైట్‌ కు సంబంధించిన కేసుపై క్లారిటీ ఇచ్చాడు.