Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: మ‌న హీరోల హిందీ సొంత‌ డ‌బ్బింగులు

By:  Tupaki Desk   |   15 Aug 2021 9:30 AM GMT
టాప్ స్టోరి: మ‌న హీరోల హిందీ సొంత‌ డ‌బ్బింగులు
X
పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కి భాషా నైపుణ్యం క‌మ్యూనికేష‌న్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల ప్ర‌య‌త్నం చూస్తుంటే ఈ విష‌యంలో చాలా తెలివైన ప్లానింగ్ తో సాగుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ బాట‌లో అల్లు అర్జున్ ..చ‌ర‌ణ్‌.. తార‌క్ వంటి క‌థానాయ‌కులు సొంతంగా హిందీ డ‌బ్బింగులు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగులు చెప్పుకునేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌ని తెలిసింది.

ఇటీవ‌ల అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ తో `పుష్ప డ్యూయాల‌జీ` ప్లాన్ ఈ త‌ర‌హానే. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు- తమిళ్- కన్నడ- మలయాళం - హిందీ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప‌ మొదటి భాగం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన సొంత వాయిస్ ని అన్ని భాషల్లో డబ్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అది వాస్త‌వ‌రూపం దాలిస్తే సినిమాకి అద‌న‌పు అస్సెట్ కానుంది.

అలాగే పుష్ప‌కి హిందీ మార్కెట్ చాలా కీల‌కం. అందువ‌ల్ల హిందీ డ‌బ్బింగ్ ని బ‌న్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోనున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళంలో ఎలానూ బ‌న్నికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా అత‌డు ఆ భాష‌లోనూ డ‌బ్ చేస్తాడు. స‌మ‌యాన్ని బ‌ట్టి ఇత‌ర భాష‌ల‌కు త‌నే స్వయంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటారు.

ఇత‌ర భాష‌ల్లో సొంత టోన్ తో వెళితే అది హీరోకి పెద్ద ప్ల‌స్ అవుతుంది. ఇంత‌కుముందు `సాహో` కోసం ప్ర‌భాస్ హిందీ డ‌బ్బింగ్ చెప్ప‌డం అక్క‌డ ప్ల‌స్ అయ్యింది. `సాహో` హిందీలో విజ‌యం సాధించింది. చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను తెచ్చింది. త‌దుప‌రి ఆర్.ఆర్.ఆర్ కోసం రామ్ చరణ్ - తార‌క్ డ‌బ్బింగ్ చెబుతార‌ని భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం అక్కినేని నాగ‌చైత‌న్య `లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రంతో డైరెక్ట్ గా హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. అక్క‌డ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటారా.. లేదా? అన్న‌ది చూడాలి. మ‌హేష్.. ప‌వ‌న్ లాంటి స్టార్లు న‌టించిన సినిమాలు మునుముందు పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌య్యేవే. అందువ‌ల్ల వీరంతా త‌మ సినిమాల‌కు హిందీ డ‌బ్బింగుల‌ను చెప్పుకునేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. మ‌న స్టార్ల‌కు తెలుగు-హిందీ-త‌మిళం భాష‌ల్లో ప్ర‌వేశం ఉంది. అందువ‌ల్ల భాష ప‌ర‌మైన స‌మ‌స్య వారికి లేద‌ని భావించాల్సి ఉంటుంది.