Begin typing your search above and press return to search.

అప్పుడే సల్మాన్ ఖాన్ లా ఊహించుకుంటే ఎలా ?

By:  Tupaki Desk   |   1 Jun 2019 12:01 PM IST
అప్పుడే సల్మాన్ ఖాన్ లా ఊహించుకుంటే ఎలా ?
X
పొట్టకూటికి లక్ష దారులు అనే తరహలో సినిమా పబ్లిసిటీకి మన హీరోలు దర్శక నిర్మాతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. నిన్న జరిగిన హిప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ స్టేజి మీద డాన్స్ చేస్తూ ఆనందంలో చొక్కా విప్పి విసిరేయడం ఆహుతులను ఆశ్చర్యపరిచింది. నిజానికి ఇలాంటి ట్రెండ్ మన దగ్గర లేదు. బాలీవుడ్ లో ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే పేటెంట్ రైట్స్ తీసుకున్నట్టు ఎక్కడబడితే అక్కడ చొక్కాలు విసిరెసి అర్ధనగ్నంగా ఇంటికి కూడా వెళ్తాడు. అంతకంటే కండలు ఉన్న మిగిలిన హీరోలు సైతం అలాంటి సాహసం చేయలేదు.

ఇక సౌత్ లో అలాంటి పోకడ లేదు గాక లేదు. కాని అనూహ్యంగా కార్తికేయ తన సిక్స్ ప్యాక్ బాడీని ఇలా స్టేజి మీదే ఎక్స్ పోజ్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఏమో కాని సోషల్ మీడియాలో విసుర్లు గట్టిగా వినపడుతున్నాయి. ఇంకా హీరో గారు ఆరెక్స్ 100 హ్యంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేదని అందుకే ఇందూను పడగొట్టిన తరహాలో ఇలా నేరుగా ట్రై చేస్తున్నాడని కామెంట్స్ మొదలైపోయాయి. ఇది ఒకరకంగా చెప్పాలంటే అత్యుత్సాహమే.

కేవలం రెండు సినిమాల వయసున్న ఓ యూత్ హీరో మరీ ఇంత ఓపెన్ గా వేలమంది నేరుగా లక్షలాది టీవీలో చూస్తుండగా ఇలా షర్టు విప్పి గెంతులేయడం మనకు అలవాటు లేని వ్యవహారం. తెరమీద చూపించడం వేరు. అది స్టార్లు కూడా చేశారు. కాని పబ్లిక్ స్టేజి అన్నప్పుడు కొంత ఆలోచన అయితే అవసరం. సరే వైరల్ కావడానికి జనం సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏదో ఒక ఇష్యూ దొరకాలి కాబట్టి ఇలా వాడుకున్నాడు అనుకోవచ్చు. 7న విడుదల కానున్న హిప్పి మీద హీరో నమ్మకం ఈ లెక్కన మాములుగా ఉన్నట్టు లేదు