Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'హిప్పి'

By:  Tupaki Desk   |   6 Jun 2019 9:17 AM GMT
మూవీ రివ్యూ: హిప్పి
X
చిత్రం : 'హిప్పి'

నటీనటులు: కార్తికేయ - దిగంగన సూర్యవంశీ - జేడీ చక్రవర్తి - జాజ్బా సింగ్ - వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - శ్రద్ధా దాస్ - సుదర్శన్ తదితరులు
సంగీతం: నివాస్ ప్రసన్న
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
మాటలు: టి.ఎన్.కృష్ణ - కాశి
నిర్మాత: కలైపులి థాను
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: టి.ఎన్.కృష్ణ

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు కార్తికేయ.. దాని తర్వాత చేసిన సినిమా ‘హిప్పి’. ఇంతకుముందు సూర్య హీరోగా ‘నువ్వు నేను ప్రేమ’ అనే సినిమా తీసిన తమిళ దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించగా.. కోలీవుడ్‌ కే చెందిన సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అందరూ ముద్దుగా హిప్పి అని పిలుచుకునే దేవా (కార్తికేయ) బాగా రొమాంటిక్. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఓ అమ్మాయి ప్రపోజ్ చేసిందని ఒప్పేసుకునే అతను.. ఆమెతో రిలేషన్లో ఉండగానే తన స్నేహితురాలైన ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవంశీ) పట్ల ఆకర్షితురాలవుతాడు. తర్వాత ఆమెను ప్రేమలో పడతాడు. ఆపై ఆముక్త కూడా అతడిని ప్రేమిస్తుంది. కానీ కొన్నాళ్లు బాగానే ఉన్న వీరి ప్రేమాయణం ఆ తర్వాత గతి తప్పుతుంది. ఆముక్త తీరుతో విసిగిపోయి ఆమెను వదిలించుకోవాలనుకుంటాడు. ఆమె కూడా అతడికి దూరం కావాలనుకుంటుంది. కానీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న వీళ్లిద్దరూ అనేక గొడవల తర్వాత తిరిగి కలిశారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో ఓ అమ్మాయిని రోడ్డు మీద బెడ్రూంలో ఉండే పొజిషన్ లో మీదికెక్కించుకుని లిప్ లాక్ చేస్తుంటాడు. అంతలో ఆ అమ్మాయి ఫ్రెండ్ అక్కడికొస్తుంది. వీళ్ల బండి పాడైందని.. తన బైక్ మీద ఎక్కించుకుంటుంది. ఇద్దరికీ మధ్యలో కూర్చున్న హీరోను వెనుక ఉన్న గర్ల్ ఫ్రెండ్ వాటేసుకుని ఏదేదో చేసేస్తుంటుంది. హీరో ముందున్న కొత్తమ్మాయిని దాదాపుగా వాటేసుకున్నట్లే కూర్చుని కురులు వాసన చూస్తూ తన్మయత్వంతో ఊగిపోతుంటాడు. తర్వాత కూడా పక్కన గర్ల్ ఫ్రెండ్‌ ను పెట్టుకునే కొత్తమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఇక రాత్రి అయ్యాక తన ప్రేయసితో శృంగార కార్యకలాపాలన్నీ ముగించుకున్నాక అర్ధరాత్రి వేళ బెడ్ మీది నుంచి లేచి నీళ్లు తాగడం కోసం వచ్చిన అతను.. బయట కొత్తమ్మాయి ఒంటరిగా కూర్చుందని తెలిసి అక్కడికెళ్తాడు. మళ్లీ ఆమెకు లైనేస్తాడు. మెరుపులకు భయపడినట్లు కలరింగ్ ఇచ్చి ఆమెను వాటేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వేషాలన్నీ అయ్యాక ఒక శుభ ముహూర్తం చూసి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు.

ఇదంతా వినడానికి ఎబ్బెట్టుగా అనిపించి ఉండొచ్చు. కానీ హీరో దీనికి చెప్పిన లాజిక్ తెలిస్తే మాత్రం ఎవరి మనసైనా కరిగిపోవాల్సిందే. అప్పటిదాకా రొమాన్స్ చేసిన అమ్మాయి పట్ల తనకు ఫీలింగ్స్ లేవని.. రెండో అమ్మాయిని చూస్తే మాత్రం బాడీ అంతా షేకైపోతోందని.. ఇదే అసలైన ప్రేమని అంటాడు. మొదటి అమ్మాయికి ముందు కోపం వచ్చినా.. అతగాడిని అర్థం చేసుకుని పక్కకు తప్పుకుంటుంది. కానీ రెండో అమ్మాయి అంత తేలికైన రకం కాదు. నేను ఫట్ మని పడిపోయే రకం కాదని ఆమె ముందే వార్నింగ్ కూడా ఇస్తుంది మరి. ఈ అమ్మాయి అతడికో కఠినమైన పరీక్ష పెడుతుంది. నాకోసం ఏమైనా చేస్తావా అని అడిగి.. అలాగయితే గుండు గీయించుకో అంటుంది. హీరో అలాగే చేస్తాడు. ఇంత త్యాగం చేశాక ఎంతటి కఠినస్థురాలైనా కరిగిపోవాల్సిందే కదా. ఆమె కూడా అంతే. వెంటనే అతడి ప్రేమలో పడిపోతుంది. చూశారా.. కథ ఎంత కొత్తగా ఉందో? ఇలాంటి కథ ఎప్పుడైనా విన్నారా కన్నారా..? లేకుంటే మాత్రం ‘హిప్పి’ చూసి తరించండి.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో హీరో చొక్కా విప్పి బేర్ బాడీతో డ్యాన్స్ చేస్తుంటే అది చూసి హీరోయిన్ అతడి మోజులో పడిపోతుంది. బహుశా దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ సీన్ చూశాకే ‘హిప్పి’ కథ రాశాడో ఏమో తెలియదు మరి. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా హిట్టవడానికి హీరో బాడీనే ఒక ముఖ్య కారణం అని అయినా భావించి ఉండాలి.. లేదంటే కార్తికేయ బాడీ అతడికి బాగా నచ్చేసి దాన్ని తెరమీద ఇంకా బాగా చూపించాలన్న కోరికతో అయినా ‘హిప్పి’ తీసి ఉండాలి. ఏదో ఒకటి రెండు సీన్లయితే ఓకే అనుకోవచ్చు. పాటొచ్చినా.. ఫైటొచ్చినా.. రొమాన్స్ చేసినా.. కామెడీ చేసినా.. ఏ సీన్లో అయినా కార్తికేయ బేర్ బాడీ చూపించడానికి ఆ తపన ఏంటో అర్థం కాదు. హీరోయిన్లు కూడా తమ శాయశక్తులా కష్టపడి అందాల్ని ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నించినా కూడా హీరో ముందు తేలిపోయారంటే.. పరిస్థిితి అర్థం చేసుకోవచ్చు.

మొదటి హీరోయిన్ తో తెగ రొమాన్స్ చేసి.. రెండో హీరోయిన్ని చూసిన తొలి చూపులోనే కామంతో కటకటలాడిపోయే హీరో.. ఆమెతో నెలల తరబడి సహజీవనం చేస్తూ కూడా చిన్న చిన్న రొమాన్సులు మాత్రమే చేస్తాడట. ఎక్కడా హద్దులు దాటడట. అబ్బా.. నా ప్రియుడు ఎంత గొప్పోడో అని మురిసిపోయి అతడి కోసం తన నగలన్నీ తాకట్టు పెట్టి ఆదుకోవాలని అనుకుంటుంది కథానాయిక. ఇంతకీ హీరో అంతగా ఆర్థిక ఇబ్బందుల్లో పడటానికి కారణం ఎవరంటే.. ఆ హీరోయినే. సన్నివేశాల గొప్పదనం ఇలా ఉంటే.. ఇక డైలాగుల దగ్గరికెళ్దాం. హీరో బాస్ తన ఉద్యోగులకు రకరకాల చిట్కాలు చెబుతూ.. మీకెప్పుడైనా స్ట్రెస్ గా ఉంటే ‘చేత్తో కొట్టుకోండి’ అంటూ స్ట్రెస్ చేసి.. చెయ్యి పైకి లేపి మరీ చెబుతాడు. ఇంకో సీన్లో హీరోయిన్.. హీరోను చూస్తూ ‘నీకు లేచిందా’ అని స్ట్రెస్ చేసి అడుగుతుంది. మరో సన్నివేశంలో వెన్నెల కిషోర్ ‘నీ కాక్ కట్’ చేస్తా అని మాట తడబడి.. ‘కాక్ కాదు.. టెయిల్ కట్ చేస్తా’ అంటాడు. సినిమా అంతటా ఇలాంటి ఆణిముత్యాలెన్నో. ఇవన్నీ కూడా సోకాల్డ్ ‘బోల్డ్’ సినిమాలో భాగం అన్నమాట. మనం స్వీకరించలేకపోతే పరిణతి లేదనుకోవాలి. సినిమా అంతా అయ్యాక పైన చెప్పుకున్న ఆణిముత్యాల్లాంటి సన్నివేశాలు.. డైలాగులు మాత్రమే గుర్తుంటాయి. కథ ఇది అని చెప్పుకోదగ్గ మెటీరియల్ ఇందులో ఏమీ లేదు. ఇక కథనం గురించి లోతుగా ఏం మాట్లాడుతాం?

నటీనటులు:

‘హిప్పి’ ప్రమోషన్లలో భాగంగా తనకు గొప్ప బాడీ ఉందని తాను ఫీలవుతానని అన్నాడు కార్తికేయ. దర్శకుడు ఈ విషయాన్ని అతడికి బాగా నూరి పోశాడేమో తెలియదు. ‘ఆర్ ఎక్స్ 100’ను మించి ఆకర్షణీయంగా బాడీ పెంచాడు. సినిమా అంతటా తెగ ఎక్స్ పోజ్ చేశాడు. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ కూడా అతడి ముందు దిగదుడుపే. సల్మాన్ సినిమాకు ఒకట్రెండు సన్నివేశాల్లో బేర్ బాడీ చూపిస్తాడు. కానీ ఒక సినిమాలో ఇంతగా బాడీ ఎక్స్ పోజ్ చేసిన హీరో మరొకరు కనిపించరు. కార్తికేయ నటన గురించి మాత్రం ఏం చెప్పడానికి లేదు. హీరోయిన్ దిగంగన కొన్ని యాంగిల్స్ లో అందంగా కనిపించింది. నటన పర్వాలేదు. రెండో అమ్మాయి జాజ్బా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమె ఎప్పుడు స్క్రీన్ నుంచి తప్పుకుంటుందా అనిపిస్తుంది. జేడీ చక్రవర్తి ఓవరాక్షన్ తో వాయించేశాడు. మొదట్లో అతడి పాత్ర చూసి ఇదేదో భలే ఫన్నీగా ఉందే అనుకుంటాం. కానీ తర్వాత ఆ పాత్ర తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి. వెన్నెల కిషోర్.. బ్రహ్మాజీ లాంటి టాలెంటెడ్ కమెడియన్లను వృథా చేశారు. ఉన్నంతలో వాళ్ల పంచులే అక్కడక్కడా కాస్త పేలాయి. సుదర్శన్ పర్వాలేదు.

సాంకేతికవర్గం:

నివాస్ ప్రసన్న పాటలు గుర్తుంచుకునేలా లేవు కానీ.. పర్వాలేదనిపిస్తాయి. సినిమాలో పాటలే ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. గోవా ఎపిసోడ్ బాగా తీశాడు. సాంకేతికగంగా ‘హిప్పి’లో క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ చూశాక మాత్రం కలైపులి థాను లాంటి అగ్ర నిర్మాత ఇలాంటి సినిమా చేయడానికి కారణం కనిపించదు. ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం తప్పితే ఇలాంటి కథ విని సినిమా చేయడంలో ఆంతర్యం కనిపించదు. దర్శకుడు టి.ఎన్.కృష్ణ గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. ‘ఆర్ ఎక్స్ 100’తో కార్తికేయకు వచ్చిన పేరు, క్రేజ్ మొత్తం మటాష్ అయిపోయే చెత్త కంటెంట్ తో అతను సినిమా తీశాడు. అసలు కథంటూ లేని సినిమాను పేలవమైన నరేషన్ తో పూర్తిగా నీరుగార్చేశాడు.

చివరగా: హిప్పి.. అంతా పిప్పే

రేటింగ్: 1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre