Begin typing your search above and press return to search.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఘన చరిత్ర తెలుసా

By:  Tupaki Desk   |   22 Aug 2021 8:30 AM GMT
చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఘన చరిత్ర తెలుసా
X
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ చాలా మంది దక్కించుకున్నారు. అన్ని భాషల్లో కూడా ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. కాని మెగా స్టార్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు.. ఇప్పటికి చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగా చిరంజీవి రియల్‌ మెగా స్టార్‌ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు. చిరంజీవి 1998 లో స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌.. ఐ బ్యాంక్ ఇటీవల ప్రారంభించిన ఆక్సీజన్ బ్యాంక్ ఇలా ఎన్నో రకాలుగా ఆయన సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. దేశంలోనే చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ కు అత్యంత అరుదైన రికార్డులు దక్కాయి. కొన్ని వేల మంది ప్రాణాలను చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ ప్రాణాలు కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కారణం ఆయన కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక రోజు పేపర్ చదువుతున్న చిరంజీవికి రక్తం అందక పలువురు మృతి అంటూ వార్తను చూశాడు. ఆ వార్తను చూసి చలించి పోయిన చిరంజీవి మరుసటి రోజే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రక్తం ఇచ్చేందుకు ఇంత మంది ఉండగా ముందుకు రాక పోవడం ఏంటీ అంటూ ఆయన మనసులో భావించి తన అభిమానులు ముందుకు వచ్చి రక్తం ఇస్తారనే నమ్మకంతో చిరంజీవి రక్తదాన కేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి ఆలోచనను ఆయన అభిమానులు సమర్థించారు. మొదట్లోనే కొన్ని వేల మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

ఇటీవల రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్య బ్లడ్‌ బ్యాంక్‌ వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి. నటి హేమ కూడా డెలవరీ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ నుండి రక్తం అందడం వల్లే బతికారు. ఈ విషయాన్ని ఆమె గతంలో చెప్పుకొచ్చారు. బ్లడ్‌ బ్యాంక్ నిర్వహణ అంత సులభమైన పక్రియ కాదు. దాని కోసం చాలా ఖర్చు అవుతుంది. రక్తం సేకరించి నిల్వ చేయడం అనేది చాలా కష్టమైన పక్రియ అంటూ ఆయన పేర్కొన్నాడు. అందుకోసం అయ్యే ఖర్చును అన్నయ్య చిరంజీవి భరిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ కు ఇప్పటి వరకు 1.8 మిలియన్ ల మంది అంటే 18 లక్షల మంది రక్తంను ఇచ్చారు. లక్షల మందికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి రక్తం సరఫరా అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లకు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి రక్తం పంపించడం జరిగింది. వేలాది మంది ప్రాణాలను కాపాడిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇప్పటికి కూడా అంతే ఉత్సాహంతో నడుస్తోంది. కరోనా విపత్తు సమయంలో కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి వేలాది మందికి రక్తం పంపించడం జరిగింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్‌ కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.