Begin typing your search above and press return to search.

'హిట్ 2' ట్రైలర్: ఉత్కంఠభరితంగా సాగిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 6:27 AM GMT
హిట్ 2 ట్రైలర్: ఉత్కంఠభరితంగా సాగిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..!
X
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం "హిట్: ది సెకండ్ కేస్". శైలేష్ కొలను ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. ఇది 'హిట్' చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన గ్రాండ్ ఈవెంట్‌ లో 'HIT 2' ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేసారు.

ఒక భయంకరమైన కేసును ఎదుర్కొన్న కూల్ కాప్, హొమిసైడ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్ కృష్ణ దేవ్ యొక్క ఇన్వెస్టిగేషన్ జర్నీని ఈ ట్రైలర్ లో చూపించారు. జనరల్ ఈ క్రిమినల్స్ అంతా తెలివిలేని వాళ్ళు.. కోడి బుర్రలు.. 5 నిముషాలు చాలు వీళ్ళని పట్టుకోడానికి అంటూ నేరస్థులను KD ఎగతాళి చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అయితే అతను నగరాన్ని షాక్ కి గురి చేసిన ఓ భయంకరమైన హత్య కేసును ఛేదించాల్సి వచ్చింది.

కిల్లర్ ని పట్టుకునే క్రమంలో కృష్ణ దేవ్ ఊహించని విషయాలను కనుగొంటున్నాడు. అయితే హంతకుడు ఎవరనేది కనిపెట్టకపోవడంతో.. ఈ కేసుని లా అండ్ ఆర్డర్ కి ట్రాన్ఫర్ చేయమని పై అధికారి రావ్ రమేష్ సూచిస్తున్నాడు. దీన్ని ఛాలెంజిగ్ గా తీసుకున్న కేడీ.. వరుసగా అమ్మాయిలను హత్య చేస్తున్న సైకో కిల్లర్ ని పట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

KD జీవితం, ప్రేమ, ఉద్యోగం మరియు మిగతావన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అతని ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించింది. తనికెళ్ళ భరణి - శ్రీకాంత్ మాగంటి - కోమలి ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించారు. అయితే ఈ ట్రైలర్ అందరినీ ఆశ్చర్యపరిచే బ్యాంగ్‌ తో ముగుస్తుంది. 'కోడి బుర్రలు' అని కేడీ అన్నందుకే అతనికి సవాలు విసరడానికి కిల్లర్ ఈ హత్యలన్నీ చేస్తున్నాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

అమ్మాయిల శరీర భాగాలను వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేస్తున్న నర హంతకుడిని కేడీ కనిపెట్టాడా? ఈ హత్యల వెనుక అసలు మోటివ్ ఏంటి? KD ఈ ఛాలెంజిగ్ కేసును పరిష్కరించాడా లేదా? అనేది మెయిన్ ఫ్లాట్. కథ సాగుతున్న కొద్దీ కనెక్ట్ అయ్యే అనేక ఆసక్తికరమైన పాత్రలు మరియు సంఘటనలు ఉంటాయని ఈ ట్రైలర్ సూచిస్తుంది. జాన్ స్టీవర్ట్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ మరియు ఎస్ మణికందన్ విజువల్స్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ లో కూల్ కాప్ కెడి పాత్రలో శేష్ ఆకట్టుకున్నాడు. 'హిట్' ఫస్ట్ కేసుని తెలంగాణాలో ఛేదిస్తే.. 'హిట్ 2' లో ఆంధ్రప్రదేశ్‌ లోని కేసుని డీల్ చేసారు. మొదటి భాగంతో పోల్చినప్పుడు కంటెంట్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటుగా యాక్షన్ పాళ్ళు ఈ రెండో భాగంలో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.

"హిట్ - ది సెకండ్ కేస్" చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. 2022 డిసెంబర్ 2న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 'మేజర్' తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్.. ఇప్పుడు నాని తో కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.