Begin typing your search above and press return to search.

థియేటర్ లో హిట్.. ఓటీటీలో ఫట్.. కారణం ఇదే..!

By:  Tupaki Desk   |   26 April 2021 12:30 PM GMT
థియేటర్ లో హిట్.. ఓటీటీలో ఫట్.. కారణం ఇదే..!
X
'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన రెండో సినిమా ''జాతి రత్నాలు''. ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా.. ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. 'మహానటి' దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అనుదీప్ కేవీ తెరకెక్కించాడు. ప్రమోషన్స్ తో విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లోనూ సత్తా చాటింది. రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం యూఎస్ఏ లో 1 మిలియన్లకు పైగా డాలర్లు వసూలు చేసింది. కరోనా పాండమిక్ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాగా నిలిచింది. థియేటర్లలో పగలబడి నవ్వుకున్నామని.. ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించిన సినిమా లేదని చూసిన వాళ్ళు అన్నారు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా హైలేరియస్ గా ఉందని ట్వీట్స్ పెట్టారు.

ఈ నేపథ్యంలో 'జాతిరత్నాలు' సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టారు. వెండితెరపై నవ్వుల జల్లు కురిపించిన హాస్య రత్నాలు.. ఓటీటీ స్క్రీన్ పై మరోసారి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో సినిమా చూసిన వాళ్ళందరూ దీనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకి పాజిటివ్ టాక్ - మంచి రివ్యూస్ ఎలా ఇచ్చారో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కామెడీ సీన్స్ సిల్కీగా ఉన్నాయని.. వీటికి థియేటర్లలో పొట్టచెక్కలయ్యేలా నవ్వు ఎలా వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. దీనిని బట్టి థియేటర్ లో హిట్ అయిన 'జాతి రత్నాలు' సినిమా ఓటీటీ ఆడియన్స్ ని నిరాశ పరుస్తోందని అర్థం అయింది. అలానే థియేటర్ ఎక్సపీరియన్స్ కి స్మాల్ స్క్రీన్ అనుభూతికి తేడా అదేనని స్పష్టం అవుతోంది.

నిజానికి కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. చుట్టూ జనాలు మధ్య మంచి సౌండింగ్ తో బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక విధమైన ఉత్సాహం ఉంటుంది. అలానే లాజిక్కులు మ్యాజిక్కులు ఆలోచించకుండా సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఓటీటీ విషయానికొస్తే మొబైల్స్ లో టీవీల్లో చూస్తున్నప్పుడు అనుభూతి వేరేగా ఉంటుంది. స్టోరీలో లాజిక్స్ వెతుకుతాం.. మళ్ళీ వెనక్కి వెళ్లి దాన్ని పాయింట్ ఔట్ చేస్తాం.. కొంచెం నచకపోయినా ఫార్వర్డ్ ఆప్షన్ ఎలాగూ ఉంటుంది. ఇప్పుడు 'జాతిరత్నాలు' సినిమా విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా 2021లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో 'జాతి రత్నాలు' సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు ప్రకటించాడు.