Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : హిట్

By:  Tupaki Desk   |   28 Feb 2020 8:29 AM GMT
మూవీ రివ్యూ : హిట్
X
చిత్రం : హిట్

నటీనటులు: విశ్వక్సేన్ - రుహాని శర్మ - మురళీ శర్మ - భాను చందర్ - బ్రహ్మాజీ - హరితేజ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన - దర్శకత్వం: శైలేష్ కొలను

‘అ!’ సినిమాతో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని.. తన బేనర్లో తీసిన రెండో సినిమా ‘హిట్’. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ మిస్టరీ థ్రిల్లర్ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విక్రమ్ రుద్రరాజు (విశ్వక్సేన్) తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల తాలూకు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పోలీస్ అధికారి. అతను హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)లో పని చేస్తుంటాడు. ప్రీతి అనే ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు.. దాన్ని డీల్ చేస్తున్న లేడీ పోలీస్ కిడ్నాప్ కేసు.. రెండింటినీ ఛేదించాల్సిన బాధ్యత విక్రమ్ మీద పడుతుంది. తన మానసిక సమస్యలతో పోరాడుతూ.. అతనీ కేసుల్ని ఎలా ఛేదించాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

అసలేం జరిగింది అనే ప్రశ్న ఆరంభం నుంచి మెదళ్లను తొలిచేస్తుంటే.. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో దారులన్నీ మూసుకుపోతుంటే.. ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతుంటే.. ఆఖర్లో ఎవరూ ఊహించని ఒక ట్విస్టు ఇవ్వాలి. ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయాలి. ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలివి. ‘హిట్’ సినిమా ఈ పాయింట్లన్నిటికీ టిక్ కొట్టిస్తుంది. ఏ రకమైన డీవియేషన్ లేకుండా.. అంతుచిక్కని ఓ మర్డర్ మిస్టరీ కేసును పాయింట్ టు పాయింట్ డీటైల్డ్‌ గా చదువుకుంటూ వెళ్తున్న తరహాలో ఈ సినిమా నడుస్తుంది. మిస్టరీ థ్రిల్లర్లు చూసే వాళ్లకు కచ్చితంగా ‘హిట్’ మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరీ చిత్ర బృందం చెప్పుకున్న స్థాయికి ఒక్క క్షణం కూడా తల తిప్పలేనంత బిగి లేదు కానీ.. ఉత్కంఠ రేకెత్తించడంలో, థ్రిల్ చేయడంలోమాత్రం ‘హిట్’ విజయవంతమైంది. కాకపోతే మరీ సీరియస్ గా.. పాయింట్ మీదే నడిచే ఈ ‘హిట్’తో అందరూ కనెక్టవుతారా అన్నది సందేహం.

‘హిట్’ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇందులోని డీటైలింగ్. అసలేమాత్రం క్లూస్ లేని ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో ఒక నిపుణుడైన పోలీసాఫీసర్ ఎలా ఆలోచిస్తాడో.. అతడి ప్లానింగ్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడో అథెంటిగ్గా చూపించారిందులో. కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. నిజంగానే ఒక మర్డర్ కేసును సొంతంగా డీల్ చేసి సాల్వ్ చేసిన తరహాలో తన సినిమాను తెరపై ప్రెజెంట్ చేశఆడు. ఏదో ఊహించి రాసినట్లు కాకుండా.. పరిశోధించి తెలుసుకున్న సమాచారంతో అతను స్క్రిప్టును మలిచినట్లు అనిపిస్తుంది. ఐతే కొన్ని చోట్ల డీటైలింగ్ పేరుతో మరీ లోతుగా వెళ్లిపోవడం సినిమాకు సమస్యగా కూడా మారింది. హీరో కేసును పరిశోధిస్తుండగా.. ఒక దశలో దారులన్నీ మూసుకుపోయి.. సరైన బ్రేక్ త్రూ లేక స్ట్రక్ అయిపోతాడు. అప్పుడు హీరోలోని అసహనం ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. కథ ముందుకు సాగక సినిమా కూడా కొంచెం స్ట్రక్ అయినట్లు అనిపిస్తాయి. ఐతే ద్వితీయార్ధంలోని ఈ పోర్షన్ మినహాయిస్తే ‘హిట్’ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

‘హిట్’ సిన్సియర్ గా.. జానర్ కు కట్టుబడి సాగే థ్రిల్లర్ అని ఆరంభంలోనే అర్థమైపోతుంది. ఎక్కడా డీవియేషన్ లేదు. ప్రతి సన్నివేశం, ప్రతి షాట్.. కథను అనుసరించే సాుతుంది. హీరో ఎంత తెలివైనవాడో చూపించే ఒక సన్నివేశంతో అతడి ఇంట్రోను సింపుల్ గా అవగొట్టేశాడు దర్శకుడు. ఆ తర్వాత హీరోకు సవాలుగా నిలవబోయే మిస్సింగ్ కేసు ఎపిసోడ్ మొదలవుతుంది. ప్రీతి అనే అమ్మాయి మిస్సవడం.. ఆ కేసును పరిశోధిస్తున్న హీరో ప్రేయసి కనిపించకుండా పోవడం.. ఈ రెండు కేసుల్ని ఛేదించేందుకు హీరో రంగంలోకి దిగడంతో కథ రసపట్టులో పడుతుంది. అక్కడి నుంచి డాక్యుమెంటరీ స్టయిల్లో సాగే పరిశోధన సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రథమార్థం షార్ప్ గా ఉండి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతుంది. రెండో అర్ధంలో టెక్నికల్ విషయాల్ని మరీ లోతుగా చర్చించే సన్నివేశాలు ప్రేక్షకుల ఆసక్తిని తగ్గిస్తాయి. ఐతే అసలు గుట్టేంటో వెల్లడయ్యే ముందు హీరోకు దొరికే లీడ్స్.. ఆ తర్వాత ట్విస్టు.. కిల్లర్ నేపథ్యం.. హత్య చేయడానికి కారణాలు.. అన్నీ కూడా ప్రేక్షకులకు షాకిస్తాయి. మొత్తంగా చూస్తే థ్రిల్లర్ ప్రియులు సినిమా నుంచి సంతృప్తిగానే బయటికొస్తారు. ఐతే ఇలాంటి సినిమాలకు బాగా అలవాటు పడ్డ వాళ్లు మరీ థ్రిల్లవుతారా అన్నది డౌట్. అలాగే దర్శకుడు పూర్తిగా జానర్ కు కట్టుబడి సిన్సియర్ గా సినిమాను నడిపించిన నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ‘హిట్’ ఏమేర రుచిస్తుందన్నదీ సందేహం.

నటీనటులు:

బయట విశ్వక్సేన్ ప్రవర్తించే.. మాట్లాడే తీరుకు భిన్నమైన పాత్రలో కనిపించాడు ఈ సినిమాలో. విశ్వక్సేన్ ఏంటి.. సీరియస్ పోలీసాఫీసర్ ఏంటి అనే వాళ్లను ఆశ్చర్యపరిచేలా అతను ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్రకు ఇతనే కరెక్ట్ అనే ఫీలింగ్ చాలా త్వరగా కలిగించి.. తనతో పాటు ట్రావెల్ అయ్యేలా చేశాడతను. ఓ చేదు గతం తనను వెంటాడుతుండగా.. సంఘర్షణకు లోనవుతూ.. ఎమోషనల్ అవుతూ కేసును డీల్ చేసే పాత్రలో విశ్వక్సేన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుండిపోతాయి. హీరోయిన్ రుహాని శర్మ టాలెంట్ చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వలేదు. మురళీ శర్మ.. భాను చందర్.. హరితేజ పాత్రలకు తగ్గట్లు నటించారు. నెగెటివ్ రోల్స్ చేసిన వాళ్లు ఫిట్ అనిపించారు.

సాంకేతిక వర్గం:

సినిమాలో దర్శకుడు, హీరో తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సంగీత దర్శకుడు వివేక్ సాగరే. థ్రిల్లర్ సినిమాకు పర్ఫెక్ట్ అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో అతను ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ గా తెలుగు సినిమాల్లో వినిపించే వాటికి భిన్నమైన శబ్దాలతో అతను తన పనితనం చూపించాడు. కొన్నిచోట్ల లౌడ్ అనిపించినా ఓవరాల్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మణికందన్ ఛాయాగ్రహణం కూడా సినిమాలోని ఇంటెన్సిటీని చూపించడానికి తోడ్పడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శైలేష్ కొలనుకు థ్రిల్లర్ జానర్ మీద పట్టుందని సినిమా చూస్తే అర్థమవుతుంది. అతను మర్డర్ మిస్టరీ కేసుల్ని బాగా పరిశోధించి సినిమా తీశాడనిపిస్తుంది. అతడి డీటైలింగ్ బాగుంది. టెక్నికల్ విషయాలపై బాగా పట్టున్నట్లు కనిపిస్తుంది. మధ్యలో కొంత డీవియేట్ అయినట్లు అనిపించినా.. ఓవరాల్ గా తన ‘ఫస్ట్ కేస్’ను అతను బాగానే డీల్ చేశాడు.

చివరగా: హిట్.. థ్రిల్లర్ ప్రియుల కోసం

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre