Begin typing your search above and press return to search.

కోలీవుడ్ తలతిక్క నిర్ణయాలు

By:  Tupaki Desk   |   9 July 2019 4:53 AM GMT
కోలీవుడ్ తలతిక్క నిర్ణయాలు
X
నిన్న కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పేరుతో వచ్చిన ప్రెస్ నోట్ అక్కడ ప్రకంపనలు రేపుతోంది. ఇకపై సినిమా రివ్యూలు రాసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా విమర్శిస్తూ ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చితే వాళ్ళ మీద నిషేధం విధించడంతో పాటు లీగల్ గా చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై సినిమాల తరఫున జరిగే ఏ మీడియా ఈవెంట్ కైనా వచ్చిన ప్రతినిధులకు కేవలం టీ మాత్రమే అందజేయబడుతుందని భోజనాలు వగైరా లాంటి వసతులు ఉండవని కూడా అందులో పేర్కొన్నారు.

ఇప్పుడిది మీడియా వర్గాల్లో సీరియస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలు బాగా తీసి ప్రేక్షకుల మెప్పు పొందటం మీద దృష్టి పెట్టడం మానేసి ఇలా రివ్యూలు రాసే మీడియా వర్గాల మీద పడటం ఏంటని తీవ్రంగా చర్చించుకుంటున్నారు . అంతేకాదు రివ్యూలు ఏవైనా తేడా వస్తే ఇకపై వాళ్ళ సినిమాల ఈవెంట్ లకు ఆహ్వానాలు కూడా పంపమని చెప్పడం మరో ట్విస్ట్. నిజానికి ఎక్కడైనా ఏ బాషా సినిమా అయినా మీడియా సపోర్ట్ లేకుండా పబ్లిసిటీ చేసుకోవడం కష్టం. ప్రేక్షకుల దాకా సినిమా వెళ్ళేది వాళ్ళ ద్వారానే.

సినిమాలో నిజంగా సత్తా ఉంటే పనిగట్టుకుని బాలేదని ప్రచారం చేసినా ప్రేక్షకులు అమాయకంగా మోసపోయే సీన్ ఉండదు. అసలు టికెట్ కొనుక్కుని సినిమా మీద అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ అది తమ ఆస్తి ఎవరు ఏమి అనకూడదని నిర్మాతలు అంటే వాళ్ళు ఇళ్లలోనే ఉచిత ప్రదర్శనలు వేసుకోవాలి. కానీ ఇలా థియేటర్లలో వదిలి బిజినెస్ చేసినప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. ఆ హక్కుకు చట్టబద్దత ఉంది. ఇప్పుడీ లీగల్ నోటీసుల బెదిరింపుల ద్వారా కోలీవుడ్ నిర్మాతలు ఏం చెప్పదలుచుకున్నారో కానీ మొత్తానికి పెద్ద చర్చకే దారి తీశారు