Begin typing your search above and press return to search.

హోరాహోరీ రివ్యూ

By:  Tupaki Desk   |   11 Sep 2015 11:12 AM GMT
హోరాహోరీ రివ్యూ
X
చిత్రం- హోరాహోరీ

నటీనటులు- దీపక్ - దక్ష - చస్వా - రాఘవ - రచ్చ రవి తదితరులు
సంగీతం- కళ్యాణి కోడూరి
ఛాయాగ్రహణం- దీపక్ భగవంత్
నిర్మాత- దామోదర ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం- తేజ

హిట్టు కోసం దశాబ్ద కాలంగా దండయాత్ర చేస్తున్న డైరెక్టర్ తేజ మళ్లీ వచ్చాడు. మరోసారి కొత్త హీరో హీరోయిన్ లతో ‘హోరాహోరీ’ అనే సినిమా రూపొందించాడు. ఈసారి హిట్టు కొట్టి తీరతానని బల్లగుద్ది చెప్పాడు తేజ. మరి ‘హోరా హోరీ’ అతడి ఆశ నెరవేర్చేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

బసవరాజ్ (చస్వా) ఓ పెద్ద రౌడీ. తాను చేసిన ఓ హత్యను మాఫీ చేయడం కోసం డబ్బులివ్వడానికి పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి.. అతడి చెల్లెలు మైథిలి (దక్ష)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తర్వాతి రోజు ఆమె పెళ్లి చేసుకోవాల్సిన వాడిని చంపిస్తాడు. ఆపై మైథిలిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఇంకొకణ్నీ చంపేస్తాడు. దీంతో మైథిలికి మతిస్థిమితం తప్పుతుంది. ఆమెను కర్ణాటకలోని ఓ గ్రామానికి పంపిస్తాడు ఆమె అన్నయ్య. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునే స్కంద (దిలీప్) వల్ల మైథిలి మామూలు మనిషవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలో ఓ సెటిల్ మెంట్ కోసం ఆ గ్రామానికే వస్తాడు బసవ. అనుకోని పరిస్థితుల్లో బసవకు స్కంద స్నేహితుడవుతాడు. మరి స్కంద, బసవ తామిద్దరం కోరుకున్నది ఒకే అమ్మాయిని అనే విషయం తెలుసుకున్నారా? తెలిశాక మైథిలి ఇద్దరిలో ఎవరికి దక్కింది? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

గుర్తుండే ఉంటుంది.. హోరాహోరీ ఆడియో ఫంక్షన్ లో తేజ ఏం మాట్లాడాడో. తెలుగు సినిమాల్లో ఒకే తరహా కథల్ని రీసైకిల్ చేసి.. జనాల్ని వెర్రి బాగులోళ్లను చేస్తున్నారన్నది తేజ ఆరోపణ. ఈ మాట అన్నాడంటే అతనేదో సరి ‘కొత్త’ సినిమా తీసి ఉంటాడని.. అందుకే అంత ఆవేశం తెచ్చుకున్నాడని అనుకుంటాం. తనను ‘జయం’ డైరెక్టర్ అంటే చిర్రెత్తుకొస్తుందని.. ‘హోరాహోరీ’ని జయంతో పోలుస్తున్నా కోపం వచ్చేస్తోందని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు తేజ. ఈ మాటల్ని బట్టి ‘హోరాహోరీ’కి ‘జయం’ సినిమాకు అస్సలు పోలికే ఉండదని ఆశిస్తాం. కానీ తేజ ఏం మారలేదు. దశాబ్దం కిందట గీసుకున్న తనకు తాను హద్దుల్ని ఈసారి కూడా దాటలేదు.

ఒక పేదవాడైన, బలహీనుడైన హీరో- అవతల ఓ క్రూరుడైన, బలవంతుడైన విలన్- మధ్యలో అమ్మాయి. హీరో- విలన్ ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి హీరోను ప్రేమిస్తుంది. హీరోయిన్ కోసం వేట సాగిస్తున్న విలన్.. క్లైమాక్స్ ముందర ఆమెను పట్టుకుపోతే.. హీరో అక్కడికొచ్చి ముందు విలన్ తో తన్నులు తిని, రక్తమోడి.. చివరికి విలన్ ఉతికేసి హీరోయిన్ని తనదాన్ని చేసుకుంటాడు. ఇదీ ‘హోరాహోరీ’ మూల కథ. ఈ కథతో సినిమా తీసి ‘జయం’ పోల్చుకోకుండా సినిమా చూడమంటే ఎలా కుదురుతుంది.

టాలీవుడ్ లో ఒకే కథతో సినిమాలు తీయడం ఈ మధ్య మామూలైపోయింది. కాకపోతే తేజ విమర్శించిన వాళ్లు కథ విషయంలో ఒకే దారిలో వెళ్తున్నా.. కనీసం కథనంతో అయినా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఏదో మాయ చేసి బండి లాగించేస్తున్నారు. కానీ తేజ అలాంటి మ్యాజిక్ ఏదీ చేయలేకపోయాడు. తాను తీసిన బ్లాక్ బస్టర్ కథన కొంచెం మార్చి.. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో తీయడం తప్పితే ఇంకేం చేయలేదు.

లొకేషన్ లు.. హీరో హీరోయిన్ లు, విలన్ నేపథ్యాలు మార్చాడు తప్పితే.. తేజ తీసిన ఈ కొత్త ప్రేమకథలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. కథ, పాత్రల ఔట్ లైన్ మారింది తప్పితే.. వాటి ఆత్మ మాత్రం అలాగే ఉంది. అదే ‘హోరాహోరీ’తో వచ్చిన పెద్ద ఇబ్బంది. తేజ సినిమాల్లో ఇంతకుముందున్న బిగువు ఇందులో లేదు. ఇంతకుముందు అతను తీసిన లవ్ స్టోరీలు సీరియస్ గా ఉండేవి. ఈసారి కొంచెం ఫన్నీగా డీల్ చేద్దామనుకున్నాడు. విలన్ క్యారెక్టర్ని మరీ తమాషాగా చూపించాడు. హీరోయిన్ని కొంతసేపు పిచ్చిదానిలా చూపించాడు. సీరియస్ గా సాగాల్సిన సన్నివేశాల్ని కూడా ఫన్నీగా నడిపించాడు. బహుశా తేజ చెప్పిన ‘కొత్తదనం’ ఇదేనేమో.

హీరోయిన్ ని మతిస్థిమితం తప్పినదానిలా చూపించి.. ఆమెను మామూలుదాన్ని చేయడానికి తేజ వేసిన ఐడియాలు చూస్తేనే దర్శకుడిగా ఆయన స్థాయి ఎలా పడిపోయిందో అర్థమైపోతుంది. ఆర్నెల్లుగా దేనికీ స్పందించని అమ్మాయి.. హీరో ఎవర్నో తిడుతుంటే, తన బాధలు చెబుతుంటే రెస్పాండైపోవడం.. అతడో హగ్ ఇవ్వగానే పూర్తిగా మారిపోయి మామూలు మనిషైపోవడం చూసి దిమ్మదిరిగిపోతుంది. ప్రథమార్ధమంతా ఇలాంటి సిల్లీ సన్నివేశాలతోనే సాగుతుంది. రాకెట్ రాఘవ, హీరో అసిస్టెంట్ క్యారెక్టర్ లతో చేయించిన దాన్ని కామెడీ అని నమ్మడం చాలా కష్టం.

తేజ శైలికి భిన్నంగా సాగిన ప్రథమార్ధంతో పోలిస్తే అతడి స్టయిల్ కు దగ్గరగా ఉన్న ద్వితీయార్ధం కాస్త బెటర్. విలన్ కు విషయం ఎప్పుడు తెలుస్తుంది, అతనెలా రెస్పాండవుతాడని కొంచెం ఉత్కంఠ కలుగుతుంది. కానీ ఆ ఉత్కంఠను కూడా సరిగా నిలబెట్టేలేకపోయాడు. లాజిక్ లేని పేలవమైన సన్నివేశాలతో అతి కష్టం మీద సినిమాను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లాడు. ఓ గంటో రెండు గంటలో విలన్ కోచింగ్ ఇవ్వగానే హీరో మొత్తం ఫైటింగులన్నీ నేర్చేసుకుని చివర్లో విలన్ని చితకబాదేయడం చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. క్లైమాక్స్ లో లొకేషన్, సన్నివేశం అన్నీ ‘జయం’ సినిమాను గుర్తుకు తెస్తుంటే.. ఈ డైరెక్టరేనా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసింది అని ఆశ్చర్యపోతూ థియేటర్ నుంచి బయటికి వస్తాడు ప్రేక్షకుడు.

నటీనటులు:

ఎప్పట్లాగే తేజ దాదాపుగా అందరూ కొత్త వాళ్లనే తీసుకున్నాడు. కానీ తేజ గత సినిమాల్లో లాగా నటీనటులు బలమైన ముద్ర వేయలేకపోయారు. అందర్లోకి విలన్ గా చేసిన కన్నడ నటుడు చస్వా బెటర్ అనిపిస్తాడు. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు కానీ.. చస్వా మాత్రం తాను నటించగలనని కొన్ని సన్నివేశాల్లో చూపించాడు. ఐతే చాలా సన్నివేశాల్లో తమాషాగా మార్చేయడం వల్ల అతడి క్యారెక్టర్ సిల్లీగా తయారైంది. హీరో హీరోయిన్లు దిలీప్, దక్ష పర్వాలేదు. ఇద్దరూ గ్లామర్ విషయంలో చాలా వీక్. దక్షకు కొన్ని సన్నివేశాల్లో నటించడానికి అవకాశం దక్కింది కానీ.. హీరోకు మాత్రం డైరెక్టరే ఆ అవకాశం ఇవ్వలేదు. అతడి క్యారెక్టరే అలా ఉందది మరి. దిలీప్ కు క్లోజప్ షాట్స్ తక్కువ. అలా చూపించినపుడల్లా ఏడుస్తూనే కనిపించాడు. దక్షను మంచి లొకేషన్ లో మేకప్ వేసి చూపించినపుడు మాత్రమే హీరోయిన్ లా కనిపించింది. చాలావరకు ఆమె హీరోయిన్ అన్న ఫీలింగే కలగదు. నటన కొన్ని సన్నివేశాల్లో ఓకే. జబర్దస్త్ ఆర్టిస్టులు రాకెట్ రాఘవ, రచ్చ రవి పెద్దగా నవ్వించలేకపోయారు. హీరోయిన్ అన్నగా చేసిన నటుడు మరీ ఓవర్ గా నటించాడు.

సాంకేతిక వర్గం:

‘హోరాహోరీ’ చెప్పుకోదగ్గ అంశాలు సాంకేతిక నిపుణుల ప్రతిభే. కళ్యాణి కోడూరి పాటలు, నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి. తొలి రెండు పాటలు సినిమాలో సింక్ కాకపోవడం వల్ల సోసోగా అనిపించాయి. ఐతే హీరోయిన్ ప్రేమలో పడ్డాక వచ్చే పాట, ఇంకో రెండు పాటలు బావున్నాయి. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. నేపథ్య సంగీతం విషయంలోనూ కళ్యాణి ప్రతిభ చూపించాడు. దీపక్ భగవంత్ ఛాయాగ్రహణం కూడా బాగానే ఉంది. హీరోయిన్ మీద వచ్చే వర్షం పాటలో అతను మంచి పనితనం చూపించాడు. తేజ అన్నట్లే లైటింగ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఓ కొత్త కలర్ వచ్చింది. ఐతే కొన్ని సన్నివేశాలు మరీ మసకగా అనిపించాయి. ఓవరాల్ గా దీపక్ ఛాయాగ్రహణం బాగుంది. ఈ అదనపు ఆకర్షణల సంగతి సరే కానీ.. అసలు విషయంలోనే చాలా లోటు చేశాడు తేజ. కథాకథనాలు, మాటల విషయంలో తేజ ఇంకా జయం సినిమాలోనే ఇరుక్కుపోయాడు. కొత్తదనం కొత్తదనం అన్నాడు కానీ.. అదేమీ సినిమాలో కనిపించలేదు.

చివరగా: హోరాహోరీ.. చెదలు పట్టిన ‘జయం’

రేటింగ్ : 2/5


#HoraHori, #HoraHoriMovie, #TejaHorahori, #HoraHoriReview, #HoraHoriMovieReview, #Horahorirating, #HoraHoriTalk


Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre