Begin typing your search above and press return to search.

ప్ర‌క‌ట‌న రాకుండానే శుభం కార్డు ప‌డిందంటే ఎలా?

By:  Tupaki Desk   |   10 Feb 2022 11:21 AM GMT
ప్ర‌క‌ట‌న రాకుండానే శుభం కార్డు ప‌డిందంటే ఎలా?
X
ఏపీలో జరుగుతున్న పీఆర్సీ ఉద్య‌మంలో కొంత గంద‌రగోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు భారీ స్థాయిలో ఉద్య‌మానికి పూనుకోవ‌డం తెలిసిందే. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన పీఆర్సీ పై ఓ వ‌ర్గం ప్ర‌శంస‌లు కురిపిస్తే మెజారిటీ వ‌ర్గం దుమ్మెత్తిపోస్తోంది. కావాల‌నే కొంతమంది పీఆర్సీ ఉద్య‌మంలో కోవ‌ర్టులుగా మారి ఉద్య‌మానికి తూట్లు పొడిచార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొంత మంది పీఆర్సీ ఉద్య‌మం అయిపోయిందంటుంటే మెజారిటీ వ‌ర్గం మాత్రం పీఆర్సీ పై పోరాటం చేస్తున్నారు.

ఇదే త‌రహాలో టాలీవుడ్ టికెట్ల వ్య‌వ‌హారం గంద‌ర‌గోళంగా మార‌నుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ గురువారం ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ని ఇండ‌స్ట్రీ త‌రుపున‌ మెగాస్టార్ చిరంజీవి - ప్ర‌భాస్‌ - మ‌హేష్ బాబు - నిరంజ‌న్ రెడ్డి - కొర‌టాల శివ‌ - ఆర్‌. నారాయ‌ణమూర్తి - అలీ - పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌త్యేకంగా భేటీ అయిన విష‌యం తెలిసిందే.

భేటీ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్కరు ఏపీ సీఎంతో పాటు మంత్రి పేర్ని నానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. స‌మ‌స్య కు ఇంకా ప‌రిష్కార‌మే ల‌భించ‌లేదు. ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీకి సంబంధించిన కీల‌క విష‌యాల‌ని ప‌రిష్క‌రిస్తూ జీవోని కూడా విడుద‌ల చేయ‌లేదు.అంత‌లోనే ధ‌న్య‌వాదాల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స‌మస్యే ఓ కొలిక్కి రాలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం శుభం కార్డు ప‌డిపోయింద‌న‌డం విడ్డురంగా వుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ `సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, మా ప్ర‌తిపాద‌న‌ల‌ పై సానుకూలంగా స్పందించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు హృద‌య‌ పూర్వక ధ‌న్య‌వాదాలు. అటు సామాన్య ప్ర‌జ‌ల‌కు, ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు మంచి జ‌ర‌గాల‌నే ఉద్దేశ్యంతో గ‌తంలో నేను చ‌ర్చించిన అంశాల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం మాట్లాడారు' అని అన్నారు. అంతే కాకుండా మంత్రి పేర్ని నాని చొర‌వ కార‌ణంగానే ఈ స‌మ‌స్య‌కు శుభం కార్డు పడిందని.. మూడ‌వ వారంలోపు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన జీవో వ‌చ్చే అవ‌కాశం వుంది అని అన్నారు.

ఇక మ‌హేష్ గ‌త ఆరు నెల‌ల నుంచి అమోమ‌యంలో వున్న ఇండ‌స్ట్రీకి ఈ రోజుతో పెద్ద రిలీజ్ వ‌చ్చిందని, పేర్ని నాని - సీఎం వైఎస్ జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు అన్నారు. అంతే కాకుండా వారం ప‌ది రోజుల్లో గుడ్ న్యూస్ వింటాం అని చెప్పేశారు. రాజ‌మౌళి కూడా మా ప్ర‌తిపాద‌న‌లు విని సీఎం మంచి నిర్ణ‌యం తీసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు అన్నారు. నారాయ‌ణమూర్తి కూడా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అయితే వీరి మాట‌ల్లో ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌కు శుభం కార్డు ప‌డింద‌నిపించారు.. కానీ ప్ర‌భుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌క‌ట‌న రాకుండానే శుభం కార్డు ప‌డింద‌ని చెప్ప‌డం స‌రికొత్త వివాదానికి దారి తీసేలా వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

పీఆర్సీ వివాదం త‌ర‌హాలోనే తాజా భేటీ వివ‌దాన్ని ర‌గిలించేలా వుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. పీఆర్సీ ఉద్య‌మం స‌మ‌యంలో కొంత మంది కోవ‌ర్టులుగా మారి ఉద్య‌మం ముగిసింద‌ని, వివాదం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన పీఆర్సీ విధానాన్ని పొగ‌డ్త‌ల్లో ముంచేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు భేటీ అనంత‌రం పాల్గొన్న వాళ్లంతా శుభం కార్డు ప‌డింద‌ని అన‌డం కూడా అలాగే వుంద‌ని కొంత మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.