Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండ 'హైవే' ఎలా వుంది..?

By:  Tupaki Desk   |   19 Aug 2022 11:30 AM GMT
దేవ‌ర‌కొండ హైవే ఎలా వుంది..?
X
కొరియ‌న్ సినిమాలు, హాలీవుడ్ తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడు ప‌ట్ట‌లేని సినిమాల‌ని మ‌న వాళ్లు ఫ‌క్రీగా కాపీ కొట్టేస్తూ థ్రిల్ల‌ర్ సినిమాలు చేస్తున్నారు. కొంత మందేఓ తెలిస్తే ఫైన్ లు, రైట్స్ డ‌బ్బులు తిరిగి క‌ట్టాల్సి వ‌స్తుందంటూ ముందే కొరియ‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల రీమేక్ రైట్స్ ని తీసుకుని మ‌రి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎలాంటి రీమేక్ ల‌కు, కాపీల‌కు వెళ్ల‌కుండా ఓన్ క‌థ‌ల‌తో హాలీవుడ్, కొరియ‌న్ సినిమాల‌ని మించి హార‌ర్ థ్రిల్ల‌ర్ లు, సైకో పాత్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ లు చేస్తున్నారు.

హాలీవుడ్ థ్రిల్ల‌ర్ ల పంథాని ఫాలో అవుతూ కెమెరామెన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి. గుహ‌న్ తొలిసారి నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తో '118' పేరుతో థ్రిల్ల‌ర్ మూవీని రూపొందించి స‌క్సెస్ అయ్యాడు. అయితే ఆ త‌రువాత కూడా అదే ఫార్ములా క‌థ‌లు చేస్తూ బోరుకొట్టిస్తున్నాడు. తాజాగా ఆయ‌న చేసిన సైకో థ్రిల్ల‌ర్ 'హైవే'. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించాడు. మాన‌స రాధాకృష్ణ‌న్ హీరోయిన్ గా న‌టించింది. 'పాతాల్ లోక్' ఫేమ్ అభిషేక్ బెనర్జీ కీల‌క పాత్ర‌లో సైకోగా న‌టించాడు. ఆగ‌స్టు 19 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఢీ అలియాస్ (అభిషేక్ బెనర్జీ) ఓ సైకో కిల్ల‌ర్‌. ఒంట‌రిగా క‌నిపించిన అమ్మాయిల్ని అంబులెన్స్ లో నార్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేస్తుంటాడు. సైకో కిల్ల‌ర్ వ‌రుస హ‌త్య‌లు న‌గ‌రంలో సంచ‌ల‌నంగా మార‌తాయి. ఏపీసీ స‌యామీఖేర్ సైకో కిల్ల‌ర్ ని ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. వైజాగ్ లో విష్ణు (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) ఓ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్. త‌న స్నేహితుడు స‌ముద్రం ( స‌త్య)తో క‌లిసి హైవేపై బ‌య‌లుదేర‌తాడు. ఇదే క్ర‌మంలో తుల‌సి అనే యువ‌తి (మాన‌స రాధాకృష్ణ‌న్) త‌న తండ్రిని క‌ల‌వ‌డం కోసం ఒంట‌రిగా మంగ‌ళూరు బ‌య‌లు దేరుతుంది. ఈ ప్ర‌యాణంలో విష్ణుని క‌లుస్తుంది. త‌న‌ని మంగ‌ళూరు స‌మీపంలో వున్న బ‌స్ స్టాప్ లో వ‌దిలి వెళ‌తాడు విష్ణు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? సైకో కిల్ల‌ర్ చేతికి తుల‌సి చిక్కిందా? .. లేక‌ సేఫ్ గా త‌న తండ్రి వ‌ద్ద‌కు చేరిందా? అన్న‌దే ఈ చిత్ర క‌థ‌.

ఆస‌క్తిని రేకెత్తిస్తూనే సినిమా మొద‌లై థ్రిల్లింగ్ గా అనిపించేలోగానే క‌థ‌నం గాడి త‌ప్పుతుంది. ప‌ర‌మ రోటీన్ సైకో థ్రిల్ల‌ర్ లాగా స‌ప్పగా సాగుతూ నీర‌సాన్ని అస‌హ‌నాన్ని క‌లిగిస్తుంది. ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌లేక‌పోయింది. ఇక క్లైమాక్స్ లో అడివి జంతువుతో సాగే స‌న్నివేశాన్ని మ‌రీ సిల్లీగా తెర‌కెక్కించారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా మంచి పేరున్న గుహ‌న్ ఆ విషయంలోనూ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక బావురు మ‌నిపించాడు.

ఆనంద్ దేవ‌ర‌కొండ కామ‌న్ కుర్రాడిలా క‌నిపించాడు. త‌ను న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ క‌నిపించ‌లేదు. ఓ సాధార‌ణ పాత్ర‌గానే చూపించాడు త‌ప్పితే ద‌ర్శ‌కుడు ప్ర‌త్యేక‌త‌ల‌తో చూపించ‌లేక‌పోయాడు. ఇక కీల‌క పాత్ర‌లో న‌టించిన మానన రాధాకృష్ణ‌న్ ఆక‌ట్టుకుంది. స‌హ‌జంగా క‌నిపించింది. అభిషేక్ బెన‌ర్జీ సైకో పాత్ర‌లో ఒదిగిపోయాడు. స‌యామీఖేర్ ఓకే. స‌త్య ని పెద్ద‌గా ఉప‌యోగించుకోలేదు. జాన్ విజ‌య్‌, సురేఖా వాణి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

ఓవ‌రాల్ గా చెప్పాలంటే 'హైవే'ని భ‌రించ‌డం క‌ష్టం. ఆనంద్‌ దేవ‌ర‌కొండ మ‌రీ ఇలాంటి నాసిర‌కం క‌థ‌ని ఎలా ఏ ధైర్యంతో అంగీక‌రించాడో అర్థం కాదు. 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌', పుష్ప‌క విమానం వంటి సినిమాల‌తో వ‌చ్చిన ఆ కాస్త పేరుని 'హైవే' తుడిచేసేలా వుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.