Begin typing your search above and press return to search.

ఏవీఎస్ పడిన కష్టాలు ఎంతమందికి తెలుసు?!

By:  Tupaki Desk   |   3 May 2022 2:30 AM GMT
ఏవీఎస్ పడిన కష్టాలు ఎంతమందికి తెలుసు?!
X
ఏవీఎస్ అనగానే వెంటనే అందరికీ 'అవును నాకు అదో తుత్తి' అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో ఈ డైలాగ్ అప్పట్లో బాగా పాప్యులర్. ఈ డైలాగ్ తోనే ఏవీఎస్ కెరియర్ గ్రాఫ్ ఊపందుకుంది. ఆ తరువాత ఆయన స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.

అప్పట్లో ఆయన బ్రహ్మానందం .. ఎమ్మెస్ నారాయణ .. వంటి కమెడియన్స్ నుంచి ఉన్న గట్టిపోటీని తట్టుకుని నిలబడ్డారు. అలాంటి ఏవీఎస్ గురించీ .. కెరియర్లో ఆయన పడిన కష్టం గురించి ఆయన కుమారుడు ప్రదీప్ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"నాన్నగారు మొదట్లో జర్నలిస్ట్ గా ఉండేవారు. ఆ సమయంలోనే ఆయన మిమిక్రీ కూడా చేస్తూ ఉండేవారు. అలా ఒక స్టేజ్ పై ఆయన మిమిక్రీ చేస్తుండగానే దర్శకులు 'బాపు' గారు చూశారు .. 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో అవకాశం ఇచ్చారు.

నాన్నగారు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు అటు ఆయన తరఫు వారు .. అమ్మ తరఫువారు కూడా వద్దనే చెప్పుంటారు. ఎందుకంటే సినిమా ప్రపంచంలో సక్సెస్ అవుతామో లేదో చెప్పలేం. అయినా నాన్న చాలా ధైర్యం చేసి హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన కొత్తలో 'మైత్రీవనం' దగ్గరలోనే ఉండేవాళ్లం.

అక్కడి నుంచే నాన్నగారు సినిమాల్లో అవకాశాలు కోసం తిరుగుతూ ఉండేవారు. షేరింగ్ ఆటోల్లో ఆయన స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఒక్కోసారి ఆయన దగ్గర ఆటోకి కూడా డబ్బులు లేకపోతే ఆలా నడుచుకుంటూ వెళ్లిపోయేవారు. మరో సినిమాలో ఛాన్స్ రాకపోతే నెక్స్ట్ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి? అనే పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలో అమ్మానాన్న కష్టపడ్డారు తప్ప, మేము కష్టపడకుండా చూసుకున్నారు. ఆర్టిస్ట్ కావడానికి ముందు నాన్నగారు చాలా భయంకరమైన పరిస్థితులను చూశారు.

అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు ఇబ్బందులు పడుతున్నప్పుడు బాపుగారు .. ఈవీవీగారు .. ఎస్వీ కృష్ణారెడ్డి గారు .. రామానాయుడు గారు .. వీళ్లంతా కూడా వరుస అవకాశాలు ఇస్తూ వెళ్లారు. వాళ్లంతా కూడా మా ఫ్యామిలీకి దేవుళ్లుగానే చెప్పుకోవాలి.

సినిమాల్లో అవకాశాలు రాకపోతే మళ్లీ వెనక్కి ఎలా వెళ్లడం అనే ఒక బాధ .. భయం నాన్నగారికి ఉండేవేమో. కానీ ఎప్పుడూ కూడా బయటపడనిచ్చేవారు కాదు. క్రియేటివ్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా ఇష్టంగానూ ఉంటుంది .. కష్టంగాను ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.