Begin typing your search above and press return to search.

టాస్క్ ని ఎదుర్కొంటేనే `హృదయం` ఉన్న‌ట్టు!

By:  Tupaki Desk   |   7 March 2022 1:30 AM GMT
టాస్క్ ని ఎదుర్కొంటేనే `హృదయం` ఉన్న‌ట్టు!
X
ఏదైనా ఒక టాస్క్ ని ఎంపిక చేస్తే ఆ టాస్క్ ని నెగ్గుకు రావాలి. అలా కాకుండా ఫెయిలైతేనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. నిజానికి చాలా ఇరుగుపొరుగు సినిమాల్ని తెలుగులో స‌మ‌ర్థంగా రీమేక్ చేస్తున్నారు మ‌న ప్ర‌తిభావంతులు. ఇంత‌కుముందు త‌నిఒరువ‌న్ లాంటి క్లాసిక్ హిట్ ని తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు.

ఒరిజిన‌ల్ కంటే సురేంద‌ర్ రెడ్డి తెలుగులో బాగా తీసార‌ని పేరొచ్చింది. ఇటీవ‌లి వ‌కీల్ సాబ్.. భీమ్లా నాయ‌క్ చిత్రాలు కూడా రీమేక్ లే. మాతృక కంటే బాగా తీసార‌ని ద‌ర్శ‌కుల‌ను మెచ్చుకున్నారు. అంటే తీసేవాడిని బ‌ట్టే సినిమా ఉంటుంద‌ని ప్రూవ్ అయ్యింది.

డ‌జ‌ను పైగా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల రీమేక్ లు ఇప్పుడు తెలుగులో సెట్స్ పై ఉన్నాయి. వీటిలో చాలా విజ‌యాలు సాధించి తీరుతాయ‌న్న భ‌రోసా ఉంది. ఇప్పుడు మలయాళ చిత్రసీమలో ఇటీవలి బ్లాక్ బస్టర్స్ లో హృదయం ని రీమేక్ చేసేందుకు టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

క‌రోనా క్రైసిస్ లోనూ మాలీవుడ్ లో అతిపెద్ద థియేట్రికల్ విజయం అందుకున్న చిత్రంగా రికార్డుల‌కెక్కింది ఈ సినిమా. ఇందులో మోహ‌న్ లాల్ వార‌సుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడు కాగా... వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్- కళ్యాణి ప్రియదర్శన్ - దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని ప‌లు ప‌రిశ్ర‌మ‌ల్లో రీమేక్ చేసేందుకు హ‌క్కులు కొనుగోలు చేస్తున్నారు.

అయితే హృదయం సినిమాని ఇతర భాషల్లోకి ఎప్పుడైనా రీమేక్ చేయడం అనువైనది కాదని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఒరిజిన‌ల్ లోని ఫీల్ ని తేవ‌డం అంత సులువుకాద‌నేది వీరి విశ్లేష‌ణ‌. హృదయంలోని తారాగణం- సిబ్బంది- సంగీతం- లొకేషన్ లు- సినిమాటోగ్రఫీ వంటి అనేక అంశాలు చిత్రానికి ప్రత్యేకమైన తాజా అనుభూతిని అందించాయి. ఆ అనుభూతిని మళ్లీ తీసుకురావడం రీమేక్ ఫిల్మ్ మేకర్స్ కి చాలా కష్టమైన పని.

దాదాపు 15 పాటలు ఉన్న ఈ మూవీకి మ్యూజిక‌ల్ గా టోన్ తీసుకురావ‌డం అంత వీజీ కాద‌ని విశ్లేషిస్తున్నారు. న‌వ‌త‌రం న‌టీనటుల‌తో ఇలాంటి మ్యాజిక్ అరుదు. కానీ దానిని తెలుగు రీమేక్ లో తేగ‌ల‌రా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. తారాగ‌ణం స‌హా టెక్నీషియ‌న్లు హృద‌యం కోసం డెడికేట్ అయ్యి ప‌ని చేశారు. కానీ మ‌ళ్లీ అలాంటి వాళ్ల‌ను వెత‌క‌డం క‌ష్ట‌మ‌నేది అభిప్రాయం.

అయితే ఈ హెచ్చ‌రిక‌ల్ని గ‌మ‌నించి ఇప్పుడు మేక‌ర్స్ జాగ్ర‌త్త ప‌డితే తిరిగి మిరాకిల్స్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ఒరిజిన‌ల్ లోని ఫీల్ మిస్స‌వ్వ‌కుండా తారాగ‌ణం ఎంపిక‌.. మ్యూజిక్ .. లొకేష‌న్ల విష‌యంలో ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసి అనుభ‌వ‌జ్ఞులైన ర‌చ‌యిత‌లు టీమ్ తో వ‌ర్క్ చేస్తే అది సాధ్య‌ప‌డుతుందేమో!! ముఖ్యంగా మ్యూజిక్ కోసం చార్ట్ బ‌స్ట‌ర్ల కోసం చాలా ఎక్కువ త‌పించాల్సి ఉంటుంది.

తెలుగులో న‌వ‌త‌రం ట్యాలెంట్ ఎలాంటి సాహ‌సాల‌కైనా సిద్ధంగా ఉన్నారు. డెడికేట్ అయ్యి ప్రాణం పెట్టేవాళ్లున్నారు. అందువ‌ల్ల హృద‌యం రీమేక్ ని ఇక్క‌డ వ‌ర్క‌వుట్ చేయ‌గ‌ల‌రు. బ్లాక్ బ‌స్ట‌ర్ తీసి స‌త్తా చాటుతార‌న‌డంలో సందేహం అవ‌స‌రం లేదు. అయితే ఇలాంటి ప్ర‌య‌త్నాల‌కు మీడియా నుంచి మోర‌ల్ స‌పోర్ట్ చాలా అవ‌స‌ర‌మ‌వుతుంది.