Begin typing your search above and press return to search.

తొలి ప్రేమ.. భలే ఛాన్సులే

By:  Tupaki Desk   |   10 Feb 2018 5:31 AM GMT
తొలి ప్రేమ.. భలే ఛాన్సులే
X
ఈ వారాంతంలో ఒకటికి మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ మూడూ కూడా వేటికవే భిన్నమైన సినిమాలే. వీటిలో ఏది దేనిపై పైచేయి సాధిస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. ముందుగా వచ్చిన రెండు సినిమాల సంగతేంటో తేలిపోయింది. ‘ఇంటిలిజెంట్’ విషయంలో ఎలాంటి అస్పష్టతా లేదు. అది డిజాస్టర్ అని తొలి షోతోనే తేలిపోయింది. ఏం చేసినా ఆ సినిమాను పైకి లేపడం అసాధ్యమని స్పష్టమైపోయింది. రివ్యూల సంగతలా వదిలేస్తే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు టీవీ వాళ్లు మైకులు పెడితే.. మొహమాటానికి కూడా బాగుందని చెప్పట్లేదు. ఈ సినిమాను ఎలా పడితే అలా తిట్టేస్తున్నారు.

మరోవైపు మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’కి కూడా టాక్ ఏమంత బాగా లేదు. మోహన్ బాబు నటన బాగుందంటున్నారు తప్పితే.. సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడట్లేదు. ఇలాంటి సమయంలో శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది ‘తొలి ప్రేమ’. ముందు వచ్చిన రెండు సినిమాలు దాదాపుగా దీనికి సైడిచ్చేశాయి. ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండగా.. యుఎస్ ప్రిమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం కలిసొచ్చే అంశం. మరి ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఈ సినిమా ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. ‘ఇంటిలిజెంట్’తో పోటీ ఎందుకని శనివారం రిలీజవ్వడం వల్ల కొంత నష్టపోయిన ఈ చిత్రం ముందు వచ్చిన రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల కలిగే లబ్ధితో శనివారం అదనపు వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి. సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ వస్తే.. ‘ఫిదా’ తర్వాత వరుణ్ ఖాతాలో మరో పెద్ద హిట్ పడ్డట్లే.