Begin typing your search above and press return to search.

సంక్రాంతికి భారీ పోటీ .. అయినా బరిలోకి 'బంగార్రాజు'!

By:  Tupaki Desk   |   19 Oct 2021 4:37 AM GMT
సంక్రాంతికి భారీ పోటీ .. అయినా బరిలోకి బంగార్రాజు!
X
ఏఎన్నార్ కి రొమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ ఉండేది .. ఆయన తరువాత నాగార్జున రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. ఇక ఏఎన్నార్ పంచెగట్టి .. ముల్లుగర్ర చేతబట్టి .. పొలం గట్లపై గంతులేసిన గ్రామీణ నేపథ్యంలోని సినిమాలలో చాలావరకూ సూపర్ హిట్లే. అలాంటి నేపథ్యంలో నాగార్జున చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా కూడా ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమాలో ఆయన పోషించిన 'బంగార్రాజు' పాత్ర, జనానికి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.

దాంతో ఈ పాత్ర పేరునే టైటిల్ గా సెట్ చేసుకుని, మరోసారి గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ చేస్తే బాగుంటుందని నాగార్జున భావించారు. ఆ బాధ్యతను కూడా ఆయన దర్శకుడు కల్యాణ్ కృష్ణకే అప్పగించారు. 'సోగ్గాడే చిన్నినాయనా' కథతో తేలికగా నాగార్జునను ఒప్పించిన కల్యాణ్ కృష్ణ, 'బంగార్రాజు' కథ విషయంలో మెప్పించడానికి చాలా సమయమే తీసుకున్నాడు. అందుకు అతనికి ఉండవలసిన కారణాలు అతనికి ఉన్నాయి. నాగార్జున ఇతర ప్రాజెక్టులపై బిజీగా ఉండటం మరో కారణంగా చెప్పుకోవచ్చు.

మొత్తానికి కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చగానే .. నాగ్ ఇక ఆలస్యం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆ స్థాయి హిట్ తప్పకుండా కావాలి. అందువలన ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. 'సోగ్గాడే ..'లో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. రమ్యకృష్ణ .. లావణ్య త్రిపాఠిలతో రొమాన్స్ చేశారు. ఇక 'బంగార్రాజు' విషయానికి వస్తే నాగార్జున సరసన రమ్యకృష్ణ .. నాగచైతన్య జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జోరందుకుంది. కాంబినేషన్ కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది పల్లె నేపథ్యంలో పరుగులు తీసే కథ కావడం వలన, సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో 'సోగ్గాడే చిన్నినాయనా' కూడా 2016 జనవరి 15వ తేదీనే విడుదలై సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పింది. ఆ సెంటిమెంట్ కారణంగా అదే రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

అయితే ఈ సారి సంక్రాంతి పరిస్థితి వేరు .. అది చేసే సందడి వేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కరోనా కారణంగా దిగాలుపడిపోయిన థియేటర్లను దడదడలాడించడానికి వరుసగా స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగిపోతున్నాయి.

జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' వస్తుంటే, 12వ తేదీన 'భీమ్లా నాయక్' .. 13వ తేదీన 'సర్కారువారి పాట' .. 14వ తేదీన 'రాధే శ్యామ్' విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' వస్తున్నా ఎవరి కంటెంట్ పై గల నమ్మకంతో వాళ్లు ఉన్నారు. ఎక్కడా వెనక్కితగ్గే సూచనలు కనిపించడం లేదు. అందువల్లనే 'బంగార్రాజు' కూడా ధైర్యంగా బరిలోకి దిగేస్తున్నాడు. సంక్రాంతి సెంటిమెంట్ 'బంగార్రాజు'కు ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి మరి.