Begin typing your search above and press return to search.

యూట్యూబ్ లో సంచలనంగా మారిన ‘రౌడీ’ ప్లాప్ మూవీ

By:  Tupaki Desk   |   18 Jun 2021 4:30 AM GMT
యూట్యూబ్ లో సంచలనంగా మారిన ‘రౌడీ’ ప్లాప్ మూవీ
X
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టటం ఒక ఎత్తు.. అవకాశాలు చేజిక్కించుకోవటం మరో ఎత్తు. ఇవన్నీ సాఫీగా జరిగినా ప్రేక్షకుల మదిని దోచుకోవటం అన్నింటికంటే కష్టమైన.. క్లిష్టమైన అంశం. అయితే.. తన సినిమాతో ఇటీవల కాలంలో ఏ యువ హీరోకు రానంత క్రేజ్ ను సొంతం చేసుకోవటమే కాదు.. తానంటే చాలు పిచ్చెక్కిపోయేలా ఫ్యాన్స్ ను భారీగా సంపాదించటం విజయ దేవరకొండకే చెల్లింది.

అతగాడు నటించిన అర్జున్ రెడ్డి మూవీ అతన్ని ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. కోట్లాది మందిని అభిమానులుగా చేయటమే కాదు.. యూత్ లో స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందం మరో బ్లాక్ బస్టర్ మూవీ. దాని సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాదు.. బయటా తనదైన తీరుతో మిగిలిన వారికి భిన్నంగా మారి.. అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో.. అతగాడ్ని రౌడీ అంటూ ముద్దుగా పిలుచుకోవటం తెలిసిందే.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ ప్లాప్ అయ్యింది. అది కూడా అలాంటి ఇలాంటి ప్లాప్ కాదు. ఒకరకంగా విజయ్ కు ఊహించలేనంత షాకిచ్చింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ.. కన్నడ.. మలయాళంలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమాను తీస్తున్న సమయంలోనే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రెఢీ అయ్యారు. కాకుంటే.. సినిమా ప్లాప్ కావటంతో వెనక్కి తగ్గారు.

ఆఫ్ లైన్ లో దారుణంగా ప్లాప్ అయిన మూవీ ఆన్ లైన్ లో మాత్రం అదరగొట్టేసింది. ఊహించని రీతిలో సక్సెస్ కావటమే కాదు.. రికార్డు స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది జనవరి 19న ఈ మూవీని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే 1.20కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకొని హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు ఏడాదిన్నర అవుతున్న వేళ.. మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ 250 మిలియన్ వ్యూస్.. అంటే 25 కోట్ల వ్యూస్ ను రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. వ్యూస్ మాత్రమే కాదు.. లైక్స్ ను సైతం భారీగా కొల్లగొట్టి రికార్డుల మీద రికార్డుల్ని సొంతం చేసుకోవటం గమనార్హం.