Begin typing your search above and press return to search.

మొదటి తప్పు కింద హేమను వదిలేశారు

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:30 AM GMT
మొదటి తప్పు కింద హేమను వదిలేశారు
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిందే. గతానికి భిన్నంగా ఈసారి కరోనా సెకండ్ వేవ్ కమ్మేయటంతో షెడ్యూల్ ప్రకారం జరగకపోవటం.. అనంతరం చోటు చేసుకున్న అన్ని పరిణామాల గురించి తెలిసిందే. సంచలనంగా మారిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పిన సీనియర్ నటి హేమ.. ఈ మధ్యన సంచలన విమర్శలు.. ఆరోపణలు చేయటం.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు రావటం తెలిసిందే.

ఇది వైరల్ గా మారింది. హేమ ఆడియో క్లిప్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్లిప్ మీద ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్.. కార్యదర్శి జీవితా రాజశేఖర్ లు కలిసి క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇచ్చారు. దీనిసై స్పందించి.. ‘మా’ అసోసియేషన్ బైలాస్ లో సెక్షన్ 8 కింద హేమకు నోటీసులు జారీ అయ్యయి. ఆమె మీద చర్యలు తీసుకోవాలని కూడా డిసైడ్ అయినట్లు చెబుతారు. తాము పంపిన షోకాజ్ నోటీసుకు మూడు రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

క్రమశిక్షణ సంఘం పంపిన షోకాజ్ నోటీసులకు స్పందించిన హేమ.. వారు చెప్పినట్లే తన వివరణను పంపారు. అయితే.. ఆమె ఇచ్చిన వివరణ సరిగా లేదని.. తాము సంతృప్తి చెంద లేదని పేర్కొన్నారు. అయితే.. ఆమె చేసింది మొదటి తప్పు కావటంతో.. క్షమించి వదిలేస్తున్నామని.. మరోసారి రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజా నిర్ణయంతో ‘మా’ క్రమశిక్షణ సంఘం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది.

ఇప్పుడున్న పంచాయితీలు సరిపోవన్నట్లు.. చర్యలు తీసుకుంటే కనుక ఒక వర్గం సంతోష పడితే మరో వర్గం బాధ పడేది. అలా అని.. ఏమీ అనకుండా వదిలి పెట్టిన కష్టమే. అందుకే కాబోలు ఎవరికి ఎలాంటి హర్టింగులు లేకుండా చేయటంతో పాటు.. తప్పులు చేస్తే తిప్పలు తప్పవన్న సందేహాన్ని తాజా నిర్ణయంతో ఇచ్చారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. అలా అని ఇంకెవరూ ఇలాంటి తప్పులు చేయొద్దన్న హెచ్చరిక చేసినట్లుగా ఉందంటున్నారు. మొత్తానికి హేమకు తాజా పరిణామం రిలీఫ్ గా మారుతుందని చెప్పక తప్పదు.