Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'హుషారు'

By:  Tupaki Desk   |   14 Dec 2018 2:31 PM GMT
మూవీ రివ్యూ: హుషారు
X
చిత్రం : 'హుషారు'


నటీనటులు: తేజస్ కంచెర్ల-అభినవ్ మేడిశెట్టి-దినేశ్ తేజ్-తేజ్ కూరపాటి-రాహుల్ రామకృష్ణ-దక్ష నగార్కర్-ప్రియ వడ్లమాని-రమ్య-హేమల్-ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: రధాన్
ఛాయాగ్రహణం: రాజు తోట
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్-రియాజ్
రచన-దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి

ఈ మధ్య కుర్రాళ్లకు కిక్కెక్కించే ప్రోమోలతో ఆకర్షించిన సినిమా ‘హుషారు’. ఇందులోని పాటలు కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. కొత్త దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చైతన్య (అభినవ్ మేడిశెట్టి).. ఆర్య (తేజస్ కంచెర్ల).. ధ్రువ్ (దినేశ్ తేజ్).. బంటీ (తేజ్ కూరపాటి) స్కూల్ స్థాయి నుంచి స్నేహితులు. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ కాలేజీ జీవితాన్ని గడిపేస్తారు. చదువు మీద శ్రద్ధ పెట్టని వీళ్లంటే ఇంట్లో వాళ్లకే కాక అందరికీ చిన్నచూపే. కానీ అదేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు జీవితాన్ని గడిపేస్తుంటారీ కుర్రాళ్లు. అలాంటి సమయంలోనేచైతన్య.. క్యాన్సర్ బారిన పడతాడు. మిగతా వాళ్లనూ కష్టాలు చుట్టుముడతాయి. ఈ స్థితిలో సమస్యల నుంచి బయటపడటానికి ఈ నలుగురూ ఏం చేశారన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘హుషారు’లో ఒక సన్నివేశంలో నలుగురు కలిసి శృంగారంలో పాల్గొంటే దాన్నేమంటారు.. ముగ్గురు కలిస్తే దాన్నేమంటారు అంటూ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటారు. అక్కడ ఒకరి నోటి నుంచి ‘హ్యాండ్ సమ్’ అనే మాట కూడా వస్తుంది. ఇంకొకరు దానికి తగ్గ సింబల్ కూడా చూపిస్తాడు. ‘హుషారు’ సినిమా ఎలా నడుస్తోందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. సినిమాలో సగం చర్చ బీర్ గురించే. ప్రతి రెండో సీన్లోనూ ఎవరో ఒకరి చేతిలో బీర్ కనిపిస్తుంది. అసలీ సినిమాలో ఓ కీలక ఎపిసోడే బీర్ చుట్టూ తిరుగుతుంది. మరి ఇలాంటి సీన్లు.. ఇలాంటి మాటలతో ఏం చెప్పదలుచుకున్నారు.. ఇలాంటివి కుటుంబ ప్రేక్షకులు భరించగలరా.. సొసైటీపై ఇలాంటి సినిమాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి.. లాంటి పెద్ద పెద్ద ప్రశ్నలేసి చర్చలేమీ పెట్టాల్సిన పని లేదు.

ఎందుకంటే ‘హుషారు’ సినిమా ఎలా ఉంటుందనేది ప్రోమోల్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. అరచేతిలో శృంగార వీడియోలు అందుబాటులో ఉంటూ.. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో పచ్చి బూతులతో కూడిన వయొలెంట్ సినిమాలు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకునే రోజుల్లో ఒక సినిమా చూడాలా వద్దా.. ఎలాంటి సినిమా చూడాలి.. అనే విషయంలో ప్రేక్షకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. పైన చెప్పుకున్న ఉదాహరణ తరహాలోనే ‘హుషారు’ చాలా వరకు అడల్ట్ కంటెంట్ తో నిండిన సినిమా. ప్రధానంగా యువతను.. అడల్ట్ కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన సినిమా. ఇందులో ఏముంటుందన్నది ముందే స్పష్టత ఇచ్చారు. ఏం ఆశించి ప్రేక్షకులు వస్తారో అదే ఇచ్చారు. ఆ వర్గం ప్రేక్షకులకు వినోదానికి ఢోకా లేని సినిమా ‘హుషారు’.

టైమ్ టు టైమ్ కాలేజీకి వెళ్లి.. బుద్ధిగా చదువుకుని.. క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగం తెచ్చుకుని.. ఆ తర్వాత టైమ్ టు టైమ్ ఆఫీసుకెళ్లి.. ఒక క్రమపద్ధతిలో జీవితాన్ని గడిపేయడమే సక్సెస్ కాదు.. వయసు తగ్గ ఆటలన్నీ ఆడి.. అన్ని అల్లర్లూ చేసి.. ఒడుదొడుకులన్నీ చూసి.. చివరగా అభిరుచికి తగిన ఉపాధి చూసుకుని జీవితంలో స్థిరపడమనే సందేశాన్నిచ్చే సినిమా ‘హుషారు’. జీవితంలో అన్ని రుచులూ ఉండాలని చాటి చెబుతూ.. నలుగురు సగటు కుర్రాళ్ల జీవితంలోని అల్లరినంతా సినిమాలో చూపించారు. వాళ్లు చదువును నిర్లక్ష్యం చేస్తారు.. చీటికీ మాటికీ మందు కొడతారు.. అమ్మాయిల కోసం వెంపర్లాడతారు.. గొడవలు పడతారు.. అడల్ట్ వీడియోలు చూస్తారు.. బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తారు. మరీ ఇంత అల్లరేంటి.. ఇంత జులాయితనం ఏంటి అనిపిస్తారు. ఐతే ఇలాంటి ప్రవర్తనకు చింతించాల్సిందేమీ లేదని.. ఈ అల్లర్లు.. ఈ జులాయితనమే ఒక దశ దాటాక జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని.. కాబట్టి ఆ మెమొరీస్ ను ఎవ్వరూ వదులుకోవద్దని చెబుతుంది ‘హుషారు’.

అడల్ట్ కామెడీ విషయంలో హద్దులేమీ పెట్టుకోకపోవడం వల్ల ఆరంభం నుంచి కుర్రాళ్లకు కావాల్సినంత కిక్కు ఇస్తూ సాగుతుంది ‘హుషారు’. కథ ఒక తీరుగా నడవకపోయినప్పటికీ.. యూత్ ను టార్గెట్ చేసిన సీన్లు మాత్రం బాగానే పేలాయి. చాలా వరకు కాలేజీ కుర్రాళ్లు రిలేట్ చేసుకునేలా ప్రతి సన్నివేశం నడుస్తుంది. సన్నివేశాలు.. డైలాగులు.. అన్నీ కూడా యువతకు చాలా సహజంగా.. ట్రెండీగా అనిపిస్తాయి. సినిమా ఎంత లైట్ హార్టెట్ వేలో నడుస్తుందంటే.. ప్రధాన పాత్రధారుల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడ్డా కూడా.. అతడి మీద ‘నా పేరు ముఖేష్’ తరహా యాడ్ ఒకటి రూపొందించి నవ్వించే ప్రయత్నం చేస్తుంది అతడి మిత్ర బృందం.

ద్వితీయార్ధంలో కుర్రాళ్లు నలుగురూ సమస్యలతో సతమతం అవుతూ సాగుతున్నప్పటికీ.. సినిమా పూర్తి సీరియస్ టోన్లో సాగకపోవడం విశేషం. ఎక్కడా కామెడీకి.. అల్లరికి ఢోకా లేకుండా చూసుకున్నారు. ఈ నలుగురు కుర్రాళ్లలో జ్యూస్ అయిపోయిందనుకుంటున్న సమయానికి రాహుల్ రామకృష్ణ రంగప్రవేశం చేసి తనదైన శైలిలో వినోదం పంచుతాడు. పిచ్చాక్ సాంగ్ మాత్రమే కాదు.. అతడి ప్రతి డైలాగ్ భలేగా పేలింది. రాహుల్ రాకతో ఒక్కసారిగా హుషారు పెరిగి.. చివరి అరగంట సినిమా మాంచి స్పీడులో నడుస్తుంది. మంచి ఫీలింగ్ ఇచ్చే ముగింపుతో ‘హుషారు’ టార్గెటెడ్ ఆడియన్స్ ను సంతృప్తి పరుస్తుంది. యూత్.. అడల్ట్స్ కు మాత్రమే అంటూ ఈ చిత్ర బృందం ఇచ్చిన వార్నింగ్ తమాషాకు కాదు. నిజంగానే మిగతా వర్గాల ప్రేక్షకులు సినిమా చూసి తట్టుకోలేరు. కుర్రాళ్లకు నచ్చే కామెడీ.. రొమాన్స్.. అల్లరికైతే సినిమాలో ఢోకా లేదు.

నటీనటులు:

ప్రధాన పాత్రధారులందరూ బాగా చేశారు. అందరిలోకి తేజస్ చాలా హుషారుగా.. ఏ తడబాటూ లేకుండా నటించాడు. అభినవ్ పాత్రకు తగ్గట్లుగా సాఫ్ట్ గా కనిపించాడు. తేజ్.. దినేశ్.. ఇద్దరూ కామెడీ పండించడంలో కీలకంగా వ్యవహరించారు. నలుగురి నటనా సహజంగా అనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ టైం తక్కువే కానీ.. అతడి కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర.. పెర్ఫామెన్స్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్లలో స్వాతి వడ్లమాని తన గ్లామర్ షోతో కిక్కెక్కించింది. దక్ష నగార్కర్ పర్వాలేదు. ఇంకో ఇద్దరమ్మాయిలు చాలా నామమాత్రంగా కనిపిస్తారు. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

రధాన్ సంగీతం సినిమాకు అతి పెద్ద ఆకర్షణల్లో ఒకటి. ఇప్పటికే పాపులర్ అయిన ఉండిపోరాదే పాట సినిమాలోనూ మంచి ఫీలింగ్ ఇస్తుంది. అదే కాక పిచ్చాక్.. నాననాననా పాటలు కూడా బాగున్నాయి. పాటల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. రాజు తోట ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి ఈ తరం అర్బన్ యూత్ ఆలోచనలపై.. వాళ్ల అభిరుచులపై మంచి అవగాహనే ఉంది. వారికి నచ్చే అంశాలతో సినిమా తీశాడు. తానేం చెప్పాలనుకున్నాడో.. ఎలా చెప్పాలనుకున్నాడో అతడికి స్పష్టత ఉంది. దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడని చెప్పలేం కానీ.. తనకున్న పరిమితుల్లో టార్గెటెడ్ ఆడియన్స్ కు నచ్చేలా వినోదాత్మకంగా సినిమాను మలిచాడు.

చివరగా: హుషారు.. కుర్రాళ్లకు కిక్!

రేటింగ్: 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre