Begin typing your search above and press return to search.

థియేటర్లు తెరిస్తే.. అలా చేయబోతున్నారా?

By:  Tupaki Desk   |   10 May 2020 4:51 AM GMT
థియేటర్లు తెరిస్తే.. అలా చేయబోతున్నారా?
X
తెలుగోళ్ల జీవితంలో సినిమా చాలా కీలకం. సినిమా లేని జీవితాన్ని ఊహంచలేని పరిస్థితి. కానీ.. దగ్గరదగ్గర యాభై రోజులుగా సినిమా థియేటర్ అన్న ఊసు తర్వాత.. రానున్న రోజుల్లో థియేటర్ కు వెళ్లి సినిమా చూసే అవకాశం ఎప్పుడన్న విషయంలోనూ క్లారిటీ లేని పరిస్థితి. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో నెల తర్వాతే సినిమా థియేటర్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే.. అదేమీ కాదని.. కనీసం నవంబరు.. డిసెంబరులో కానీ థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని థియేటర్ల యజమానులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా తాము ఎదుర్కొంటున్నసమస్యలపై చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతమున్న సవాళ్లను ఎదుర్కోవటానికి వీలుగా ఏమేం చేయాలన్న అంశంపై వారు మాట్లాడుకున్నారు. ప్రభుత్వం సినిమా థియేటర్లను నడపటానికి పరిష్మన్ ఇవ్వటానికి వీలుగా తమకు తామే థియేటర్లకు సంబంధించి కొన్ని విధివిధానాల్ని సిద్ధం చేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

థియేటర్లను నడపటానికి వీలుగా కొన్ని మార్గదర్శకాల్ని తాము పాటిస్తామని పేర్కొనాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లను తిరిగి ప్రారంభించే పక్షంలో తీసుకునే జాగ్రత్తలపై వారు బోలెడన్ని ఆలోచనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకున్న వారికే సినిమా చూసే అవకాశం ఇవ్వటం.. సీటుకు సీటుకు మధ్య మరో సీటును ఖాళీగా ఉంచేసి మాత్రమే సినిమాను ప్రదర్శించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ ఒకే కుటుంబానికి చెందిన వారు తామంతా కలిసి కూర్చునే అవకాశం ఇవ్వాలంటే అందుకు అనుమతిని ప్రభుత్వం ఇవ్వాలని థియేటర్ యజమానులు కోరుకుంటున్నారు. గతంలో మాదిరి ఒక షోకు.. మరో షోకు మధ్య పది నిమిషాల నుంచి పావు గంట సమయం తీసుకుంటే.. తాజా పరిస్థితుల్లో మాత్రం అది నలబై ఐదు నిమిషాల వరకూ గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. థియేటర్లో ఒక షో పూర్తి అయిన తర్వాత హాల్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

రోజు నిర్వహించే నాలుగు షోలకు బదులుగా మూడు షోలతో ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు. కాగితం రూపంలో ఇచ్చే విధానానికి చెల్లుచీటి ఇచ్చేసి.. డిజిటల్ పద్దతినే పాటించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ ను చెక్ చేసి లోపలకు అనుమతించాలన్న ఆలోచనలో ఉన్నారు. థియేటర్ లో ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఫుడ్ కోర్టు దగ్గర భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటారు. ఇవే కాకుండా.. ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటే.. అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి.. దీనికి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.