Begin typing your search above and press return to search.

వాళ్లిచ్చే పదవులు నాకొద్దు-శరత్ కుమార్

By:  Tupaki Desk   |   20 Oct 2015 8:57 AM GMT
వాళ్లిచ్చే పదవులు నాకొద్దు-శరత్ కుమార్
X
శరత్ కుమార్.. పదేళ్లుగా తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు. ఐతే రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన శరత్.. ఈసారి నాజర్-విశాల్ వర్గం ధాటికి పదవి నుంచి దిగిపోక తప్పలేదు. తానే మళ్లీ అధ్యక్షుడినని ఆత్మవిశ్వాసంతో ఉన్న శరత్ కు మొన్నటి ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. ఐతే నాజర్ వర్గం.. శరత్ తో కలిసి పని చేయడానికి రెడీ అంటోంది. మాజీ అధ్యక్షుడిగా శరత్ మీద తమకు గౌరవం ఉందని.. ఆయనకు గౌరవ పదవులివ్వడానికి సిద్ధమని పేర్కొంది. ఐతే శరత్ ఇలాంటి ప్రతిపాదనలకు నో అంటున్నాడు. వాళ్లిచ్చే గౌరవ పదవులు తనకు వద్దు అంటున్నాడు. ఐతే సంఘానికి సంబంధించి ఏదైనా సాయం కోరితే చేయడానికి మాత్రం తాను సిద్ధమని శరత్ పేర్కొన్నాడు.

నడిగర్ సంఘం పాత భవనాన్ని కొట్టేసిన స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ కమ్ మల్టీప్లెక్స్ నిర్మించడానికి ఎస్‌పీఐ సంస్థతో తన ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాన్ని సెప్టెంబర్ 29 వ తేదీనే రద్దు చేసినట్టు శరత్ కుమార్ తెలిపాడు. ఈ ఒప్పందం రద్దుకు సంబంధించిన పత్రాన్ని మీడియాకు చూపించిన శరత్.. ఈ ఒప్పందం విషయంలో తనపై ప్రత్యర్థి వర్గం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని.. అవి తననెంతో బాధించాయని చెప్పాడు. ఎన్నికల్లో అపజయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నట్లు శరత్‌ తో పాటు మిగతా సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు నడిగర్ సంఘానికి కొత్తగా అధ్యక్షుడు, కార్యదర్శిగా ఎన్నికైన నాజర్, విశాల్ చెన్నై హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం స్థలాన్ని సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మీడియా సమావేశం గురించి నాజర్ ను అడగ్గా.. నడిగర్ సంఘం భవనానికి సంబంధించిన ఒప్పందం రద్దు పత్రాన్ని పరిశీలించిన తరువాతే మాట్లాడతానన్నారు.