Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీపై నాగబాబు స్పందించాడు

By:  Tupaki Desk   |   1 May 2018 12:06 PM GMT
ఎన్నికల్లో పోటీపై నాగబాబు స్పందించాడు
X
మెగాస్టార్ చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ విషయంలో అండగా నిలిచాడు ఆయన తమ్ముడు నాగబాబు. ఐతే ఆ పార్టీ మూడేళ్లు తిరగ్గానే అడ్రస్ లేకుండా పోయింది. దీంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం అసలు ఆ పార్టీ గురించి మాట్లాడనేలేదు. కానీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో నాగబాబు ఓపెనయ్యాడు. పవన్ కు.. జనసేనకు మద్దతుగా గళం విప్పాడు. మరి మున్ముందు నాగబాబు మరింత ఓపెనవుతాడా.. అవసరమైతే జనసేన కోసం పని చేస్తాడా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. తన తమ్ముడు కోరితే జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానన్నాడు. కానీ ఇప్పుడే ఏ విషయం చెప్పలేనన్నాడు. జనసేన తరఫున ప్రచారం కూడా చేస్తానా లేదా అనే విషయంపై తనకింకా క్లారిటీ లేదని.. ఇప్పుడే దానిపై స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని నాగబాబు అభిప్రాయపడ్డాడు.

ఇక తాను ఇటీవలే మీడియా ముందుకొచ్చి పవన్ ను లక్ష్యంగా చేసుకున్న వాళ్లపై విమర్శలు గుప్పించడంపై స్పందిస్తూ.. తమ కుటుంబ సభ్యులపై ఏకంగా వ్యక్తిగత దాడి చేయడంతో తాను.. అల్లు అరవింద్ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నాడు నాగబాబు. అంతకుముందు కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాము స్పందించలేదన్నది సరి కాదన్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ విషయాన్ని డీల్ చేస్తున్నపుడు తాము వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు అనే భావనతో సైలెంటుగా ఉన్నామన్నాడు. ఇక అభిమానుల్ని కంట్రోల్ చేయడం అన్నది తమ నియంత్రణలో ఉండదని.. లక్షల మంది అభిమానుల్లో ఎవరో ఒక్కరు ఏదో కామెంట్ చేస్తే అందుు తమను బాధ్యుల్ని చేయడం సరికాదని... ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరెలా స్పందిస్తారో తమకేం తెలుస్తుందని నాగబాబు ప్రశ్నించాడు. ఇక జబర్దస్త్ కార్యక్రమంపై వస్తున్న విమర్శల్ని నాగబాబు తిప్పి కొట్టాడు. అది క్లీన్ కామెడీ షో అని.. ఆ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూడలేక కొందరు అసూయతో విమర్శలు చేస్తున్నారని.. ఈ కార్యక్రమం ద్వారా వేలమందికి ఉపాధి దొరుకుతోందని.. ఇంటిల్లిపాదీ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారని నాగబాబు స్పష్టం చేశాడు.