Begin typing your search above and press return to search.

ప్రభాస్ గారి సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాను!

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:30 PM GMT
ప్రభాస్ గారి సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాను!
X
తమిళ .. మలయాళ భాషల్లో బిజీగా ఉండే కేరక్టర్ ఆర్టిస్టులలో 'తలైవాసల్' విజయ్ ఒకరు. ఆయన తెలుగు బాగా మాట్లాడతారు. కానీ తెలుగు సినిమాలు పెద్దగా చేయలేదు. అందుకు కారణం తమిళ .. మలయాళ భాషల్లో బిజీగా ఉండటమే. ఈ మధ్య కాలంలో ఆయన 'భాగమతి' .. 'యాత్ర' .. 'వి' వంటి సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ తాజా చిత్రమైన 'రాధే శ్యామ్' సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందని ఆయన భావిస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'రాధే శ్యామ్' వంటి ఒక సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్రకి సంబంధించి తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. ప్రభాస్ కి కృష్ణంరాజు పెద్దనాన్న కదా .. అప్పట్లో ఆయన ఇంటికి ఎదురుగా మేము షెటిల్ ఆడేవాళ్లం. కృష్ణంరాజుగారు కనిపిస్తారేమోనని చూసేవాళ్లం. అప్పట్లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. ఈ సినిమాలో ఆయన కాంబినేషన్లో చేయాలనుకున్నాను .. కానీ కుదరలేదు.

భవిష్యత్తులో కృష్ణంరాజుగారితో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, 'భాగమతి' సెట్స్ కి ఆయన వచ్చినప్పుడు నేను చూశాను. నన్ను చూడగానే ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. ప్రభాస్ గారు పలకరించడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే ఆయనతో ఒక ఫొటో తీసుకున్నాను. ఆయన చాలా సింపుల్ గా .. హంబుల్ గా కనిపిస్తుంటారు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూనే ఉంటారు. ఆయనని అందరూ అంతగా ఎందుకు అభిమానిస్తారనేది అర్థమైపోయింది.

'రాధేశ్యామ్' డబ్బింగ్ చెప్పడానికి వెళ్లినప్పుడు కొన్ని సీన్స్ చూశాను. ఆ గ్రాండియర్ చూసి నేను షాక్ అయ్యాను. ఇంతపెద్ద సినిమాలో నేను ఉన్నానా? అని ఆశ్చర్యం వేసింది. ప్రతి భాషలో .. ప్రతి పాత్రను గురించి ఒక కొత్త నటుడి మాదిరిగానే నేను ఆలోచన చేస్తాను. ఆ దర్శకుడు నన్ను ఆ పాత్రకి ఎందుకు అనుకున్నారు .. నా నుంచి ఆయన ఎలాంటి అవుట్ పుట్ ఆశిస్తున్నారు అనేది ఆలోచన చేస్తాను .. అలాగే 'రాధేశ్యామ్' చేశాను. ఈ సినిమాలో తెరపై నన్ను నేను చూసుకోవడానికి ఆసక్తితో ఉన్నాను. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చారు.