Begin typing your search above and press return to search.

తెలంగాణలో నా సినిమాలను రిలీజ్ చేయను..!

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:32 AM GMT
తెలంగాణలో నా సినిమాలను రిలీజ్ చేయను..!
X
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ ధరల అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ధరలు పెంచడం వల్ల పెద్ద సినిమాలకు లాభం చేకూరుతుందే కానీ.. చిన్న చిత్రాలను నష్టం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్‌ ధరలు పెంచటం వల్ల చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని.. మల్టీప్లెక్స్‌ లో సినిమా చూడాలనుకునే సామాన్యుడి కల.. కలగానే మిగిలిపోతుందని తెలిపారు. ప్రభుత్వం పది రోజుల్లో టికెట్ రేట్ల నిర్ణయంపై వెనక్కి తగ్గకుంటే.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయిస్తానని నట్టి కుమార్ అన్నారు.

అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయంపై మాట్లాడిన నట్టి కుమార్.. టిక్కెట్ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని ప్రకటించారు. పెంచిన రేట్లతో చిన్న సినిమాలను విడుదల చేయడం కష్టతరంగా మారుతుందని.. ప్రేక్షకులు అంత రేటు పెట్టి చిన్న చిత్రాలను చూడటానికి థియేటర్లకు రారని అభిప్రాయ పడ్డారు. ఏపీలో మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా టిక్కెట్ రేట్లు నియంత్రించి.. చిన్న సినిమాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై పునరాలోచించాలని.. ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండేలా మార్పులు చేయాలని.. అలానే చిన్న సినిమాల కోసం ఐదో షోకు అనుమతి ఇవ్వాలని నట్టి కుమార్ కోరారు. వచ్చే నెల 5వ తారీఖు లోపల దీనిపై ప్రభుత్వం ఏదొక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. ఒకవేళ ఇదే రేట్లతో సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తే మాత్రం తన నిర్మాణంలో విడుదలకు సిద్ధమైన 9 సినిమాను తెలంగాణాలో రిలీజ్ చేయలేనని నిర్మాత ప్రకటించారు.

డబ్బులు పోగొట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని.. పబ్లిసిటీ ఖర్చు అయినా మిగులుతుందని నట్టి కుమార్ అన్నారు. చిన్న నిర్మాతలు అందరూ దీని గురించి ఆలోచించాలని.. డబ్బులు వస్తున్నాయని అనుకుంటే నిరభ్యంతరంగా తమ సినిమాలను విడుదల చేసుకోవచ్చని.. ఒకవేళ పెట్టిన పెట్టుబడికి అదనంగా నష్టపోతున్నారు అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోమని నట్టి కుమార్ పేర్కొన్నారు.