Begin typing your search above and press return to search.

వాళ్ల ఆశీస్సుల వల్లనే నేను బ్రతికాను!

By:  Tupaki Desk   |   2 April 2022 12:30 AM GMT
వాళ్ల ఆశీస్సుల వల్లనే నేను బ్రతికాను!
X
నటుడిగా శివాజీరాజాకి మంచి పేరు ఉంది. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చాలా సినిమాలలో విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఎక్కువగా కామెడీ పాత్రలు చేసినప్పటికీ, అప్పుడప్పుడు ఎమోషన్స్ తో కూడిన పాత్రలతోను కన్నీళ్లు పెట్టించాడు. సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. "నేను నా బాధలను శ్రీకాంత్ తో చెప్పుకుంటానని అనుకుంటే పొరపాటే. నేను నా బాధలు చెప్పడానికి తన దగ్గరికి వెళితే ముందుగా తన బాధలను చెప్పడం మొదలెడతాడు.

అయినా 'మా' అధ్యక్షుడిగా నాతో చాలామంది తమ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక నా బాధలు ఎవరితో చెప్పుకోను? నిజం చెప్పాలంటే నేను బాధపడటం చాలా తక్కువ. ప్రతిక్షణం నేను ఎంజాయ్ చేస్తుంటాను.

అందరితోను జోకులు వేస్తూ .. కామెడీ చేస్తూ లైఫ్ ను నవ్వుతూ గడిపేస్తుంటాను. ఇటీవల నాకు హెల్త్ బాగోలేనప్పుడు నేను శ్రీకాంత్ కి కూడా చెప్పలేదు. నాకు ఇలా ఉన్న విషయం ఇండస్ట్రీలో ఒక్కరికీ కూడా తెలియదు. అమెరికా వెళ్లిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. నాకు ఇలా ఉందని చెప్పేసి నేను ఎవరి దగ్గరా చేయి చాచలేదు.

నేను చేసిన తప్పేమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోకపోవడం. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే .. ఇప్పుడయ్యే హాస్పిటల్ ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అదృష్టం కొద్దీ నేను ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రాలేదు. చాలామంది నాతో ఒక మాట అన్నారు .. "నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు గనుక, ఆ భగవంతుడు నిన్ను బ్రతికించాడు" అని. వాళ్ల ఆశీస్సుల వల్లనే నేను బ్రతికానని అనుకుంటున్నాను. నాకు మంచి హాబీ ఏదైనా ఉందంటే, ఏ మాత్రం తీరిక దొరికినా విదేశాలకు వెళుతుంటాను. ఇంతవరకూ 90 దేశాలకి పైగా వెళ్లొచ్చాను.

చెన్నై లో చాలా ఇరుకైన గదుల్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగాము. అయితే ఆర్థికపరమైన కష్టాలను మాత్రం పెద్దగా పడలేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవారినే గొప్పవాళ్లు అంటారు.

కరోనా రోజుల్లో ఇండస్ట్రీకి చెందిన ఎంతమంది ఎంత కష్టపడ్డారు? చిరంజీవిగారు లేకపోతే పరిస్థితి ఏమిటి? కొంతమంది కబర్లు బాగా చెబుతారు .. వాళ్ల వలన ఎలాంటి పనులు కావు. నేను నా స్థాయికి తగినట్టుగా సాయం చేస్తూ వెళ్లాను. ఇతరులకు సాయం చేసే అలవాటు నాకు మొదటి నుంచి ఉంది కనుక, నాకు పెద్దగా కష్టం అనిపించలేదు" అని చెప్పుకొచ్చాడు.