Begin typing your search above and press return to search.

రేసు గుర్రానికి బాలీవుడ్ ని దున్నే ఆఫ‌ర్?

By:  Tupaki Desk   |   3 Dec 2022 5:30 AM GMT
రేసు గుర్రానికి బాలీవుడ్ ని దున్నే ఆఫ‌ర్?
X
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ స్టార్ హీరోల‌కు భారీగా అవ‌కాశాలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది తాజా ప‌రిణామం. ప్ర‌భాస్‌- చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్-అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తుండ‌డంతో వీళ్లను ఏదో ఒక రూపంలో బాలీవుడ్ మార్కెటింగ్ నిపుణులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. సౌత్ మార్కెట్ ని కొల్ల‌గొట్టేందుకు ఇది స‌రైన వ్యూహంగా హిందీ ఫిలింమేక‌ర్స్ ప్ర‌ణాళిక‌ల్లో మెర్జ్ చేస్తుండ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇది మ‌న స్టార్ హీరోల పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని మ‌రింత‌గా విస్త‌రించేందుకు స‌హ‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

తాజాగా బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కాల్ వెళ్లింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రోహిత్ శెట్టి భారీ ఫ్రాంఛైజీ సినిమాల‌కు తెర తీసాడు. రోహిత్ శెట్టి కాప్ విశ్వం (యూనివ‌ర్శ్) పేరుతో భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో హీట్ పెంచాడు. ఇవి సిరీస్ లుగా అల‌రించ‌నున్నాయి. అయితే కాప్ స్టోరీల‌కు ప‌ర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ శౌర్యంని క‌లిగి ఉన్న మ‌న పాన్ ఇండియా స్టార్ల‌ను అత‌డు త‌న విశ్వంలోకి లాగే ప్లాన్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తొలిగా రోహిత్ శెట్టి నుంచి రేసుగుర్రం స్టార్ బ‌న్నీకి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని కూడా ఫిలింస‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. గోల్ మాల్ ఫ్రాంఛైజీతో అద్భుత‌మైన కామెడీ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా రోహిత్ శెట్టికి ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. చెన్నై ఎక్స్ ప్రెస్ తో అత‌డు చేసిన మ్యాజిక్ ఎలాంటిదో తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ టెంప‌ర్ ని సింబాగా ర‌ణ‌వీర్ తో రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. అలాగే ర‌ణ‌వీర్- అక్ష‌య్-దేవ‌గ‌న్ ల‌ తో సూర్యవంశీ లాంటి హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్పుడు ర‌ణ‌వీర్ సింగ్ తో సర్కస్ వంటి వెరైటీ కమర్షియల్ సినిమాని సృజించాడు.

త‌దుప‌రి రోహిత్ శెట్టి కాప్ విశ్వంలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మారిన స‌న్నివేశాన్ని బ‌ట్టి త‌న ఫ్రాంఛైజీ సినిమాల్లోకి బ‌న్నీని లాగాల‌ని అత‌డు గ‌ట్టి ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికోసం అల్లు అర్జున్ ను ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఐకాన్ స్టార్ కి ఈ ఫ్రాంఛైజీ సినిమాలు ఎలా ఉపయుక్త‌మో శెట్టి వివ‌రిస్తాడ‌ట‌.

ఓవైపు 'పుష్ప' ప్రమోషన్స్ కోసం బన్నీ రష్యాలో ఉండగా .. శెట్టి స‌ర్క‌స్ ప్ర‌చారంలో బిజీగా ఉన్నాడు. ఇంత‌లోనే భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా గురించి బ‌న్నీతో చర్చించేందుకు త్వరలో ముహూర్తం పెట్టనున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్ -అజయ్ దేవగన్ లు స్పెషల్ అప్పియరెన్స్ తో రణ వీర్ సింగ్ - అల్లు అర్జున్- కార్తీ కాంబినేష‌న్ గా ఉండాల‌ని శెట్టి ఆశిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు శెట్టి యూనివ‌ర్శ్ లో పాన్-ఇండియా పోలీస్ మల్టీ-స్టారర్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఐకాన్ స్టార్ బృందం నుంచి కానీ శెట్టి బృందం నుంచి కానీ దీనిపై ఎలాంటి అధికారిక వివ‌రం వెల్ల‌డి కాలేదు.

బ‌న్ని దృష్టి పుష్ప విదేశీ రిలీజ్ ప్ర‌చారం పూర్త‌య్యాక‌.. త‌దుప‌రి పుష్ప 2 పై మ‌ర‌ల‌నుంది. ఆ త‌ర్వాత భారీ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల‌ను క్యూలో పెట్టేందుకు ఉత్త‌రాదిన త‌న హ‌వా సాగించేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మ‌రో మెట్టు ఎక్కేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి సాహసాలైనా చేస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే పుష్ప 2 మునుముందు చాలా స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌డంలో స‌హ‌క‌రిస్తుంద‌ని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది. అత‌డు భ‌విష్య‌త్ లో బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల ఫ్రాంఛైజీల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని విశ్లేష‌ణ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.